సర్వశక్తివంతమైన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందుతూ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించాలని, ఆత్మగౌరవంతో జీవించాలని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్‌డీ ఎం.సుభాని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో గణతంత్ర, లౌకిక, సమ సమాజ సూత్రాలతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం సర్వజనులకు సమాన హక్కులను కల్పించిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని పేర్కొన్నారు.
ప్రపంచంలో అనేక దేశాలలో ప్రజాస్వామ్యం కుంటుబడి అంతర్ యుద్ధాలు, తిరుగుబాట్లతో సతమతమవుతుండగా భారతదేశం మాత్రం రాజ్యాంగ స్ఫూర్తితో, చెక్కుచెదరని ప్రజాస్వామ్యంవిశ్వాసాలతో, ఆచరణతో ముందుకు పోతుందన్నారు. ఇటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ సూత్రాలు పాటిస్తూ ప్రజలందరూ ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ రవి ప్రసాద్ ఇంకా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.