న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆయన్ను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ, గెలుపు కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. ఆదివారం సాయంత్రం గం. 5.15 సమయంలో ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అర గంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో పార్టీ తాజా స్థితిగతుల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. అప్పటికే తన ఆలోచనలను ఓ నివేదిక రూపంలో సిద్ధం చేసి పెట్టుకున్న ఈటల, అమిత్ షాకు అందజేసినట్టు సమాచారం. అందులో నియోజకవర్గాలవారిగా పార్టీ బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల బలాబలాలను పొందుపరిచినట్టు తెలిసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలితే టీఆర్ఎస్ పార్టీ మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని, అలా జరగకుండా ఆ వ్యతిరేకతను పూర్తిగా బీజేపీ వైపు మళ్లించేలా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరముందని అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది.
అధిష్టానమే పిలిచిందా?
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత కల్గిన నేతగా వ్యవహరించిన ఈటల రాజేందర్, బీజేపీలో చేరిన తర్వాత కొంత అసౌకర్యానికి, అసంతృప్తికి గురవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థి దశ నుంచి బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు బయటి నుంచి తనలాంటి నేతలను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఈటల తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసేవారు. తనను కేవలం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా మాత్రమే చూడొద్దని, రాష్ట్రంలో గ్రామీణస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా తనకు బాధ్యతలు అప్పగించాలని ఈటల అధిష్టానం పెద్దలను కోరుతూ వచ్చారు. రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదరణ పెద్దగా లేకపోవడంతో నేరుగా ఢిల్లీ పెద్దలతోనే మంతనాలు సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు శనివారం అమిత్ షా నివాసం నుంచి ఫోన్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు బయలుదేరిన ఈటల, ఢిల్లీ చేరుకోగానే నేరుగా అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. ఆయనతో భేటీ ముగిసిన వెంటనే మళ్లీ తిరిగి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.
ఈటలకు కీలక బాధ్యతలు!
దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేని బీజేపీ, తదుపరి తెలంగాణలో మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బలంగా భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని, అందులోనూ ఈటల వంటి ఆయుధాన్ని నిరుపయోగంగా పక్కనపెట్టకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. ఓబీసీలతో పాటు అన్నివర్గాల్లో గట్టి పట్టున్న ఈటలను రాష్ట్రమంతటా ఉపయోగించుకునేలా వ్యూహాలు రచిస్తోంది. దూకుడుగా వెళ్లే బండి సంజయ్‌కు తోడుగా విస్తృత రాజకీయానుభవం, ఉద్యమ నేపథ్యం కలిగిన ఈటలను కూడా ప్రయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది. లేదంటే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లబ్ది పొందే ప్రమాదం ఉందని అధినాయకత్వం భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత బిశ్వ శర్మ ఏ తరహాలో ఉపయోగపడ్డారో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గ్రామీణస్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేయడానికి ఈటల అలా ఉపయోగపడతారని నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఆయనకు త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.