పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోట సరిహద్దుల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా చిరుత వీ.కోట మండలం జవున్నిపల్లె పరిసరాల్లో సంచరిస్తోంది. చిరుతను గమనించిన పశువుల కాపరులు గ్రామంలో విషయం తెలపడంతో జవునిపల్లె పంచాయతీ ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మంగళవారం సాయంత్రం కే.నక్కనపల్లి వద్ద కుక్కను వేటాడేందుకు చిరుత రావడంతో గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో అది పరారైంది. చిరుత సంచరిస్తోందన్న విషయం తెలపడంతో భయంతో బాణసంచా పేల్చి దానిని గ్రామం వైపు రానివ్వకుండా జాగ్రత్త తీసుకున్నారు.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది నక్కనపల్లె గ్రామం వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో చిరుత పాదముద్రికలను గుర్తించారు. ఈలోపు మావత్తురు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్ హైవే వద్ద పాల ఆటోకు చీకట్లో అడ్డు రాగా.. చిరుతను తన సెల్ ఫోన్ తో చిత్రీకరించిన రామాపురంకు చెందిన ఆటో డ్రైవర్ సునిల్ సమాచారాన్ని అటవీ అధికారులు తెలియజేశాడు. సమాచారం తెలుసుకున్నవీకోట డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి సిబ్బందితో చిరుత జాడ కనుగొనేందుకు నక్కనపలి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ చిరుతను ప్రత్యక్షంగా చూసినవారు అటవీ అధికారులకు వారి అనుభవాలను వివరించారు. రాత్రి 9.45 గంటలకు జెమిని పల్లె మావత్తూరు గ్రామాల నడుమ నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్ వే వద్ద చిరుత సంచరిస్తుందన్న సమాచారం రావడంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. జవునిపల్లె పరిసరాల్లో ప్రజలు చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఆర్ఓ వేణుగోపాల్ ప్రజలకు హెచ్చరించారు.