ఇటీవలి కాలంలో చిరుతలు, పులులు సమీపంలోని పల్లెలు, పట్టణాల్లోకి రావడం శర మాములైంది. తాజాగా ఓ ఆసుపత్రిలోకి చిరుత దూరింది. అక్కడి రోగులు, ఆసుపత్రి సిబ్బందిని బెంబేలెత్తించింది.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షహాదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతను చూసి భయంతో కేకలు వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అరుపులకు చిరుత ఓ మూలన నక్కింది. చిరుతకు సంబంధించిన సమాచారాన్ని కార్మికుడు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. వారొచ్చి చిరుత వెనకున్న తలుపులను నిశ్శబ్దంగా మూసివేసి దానిని బందీని చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతను బందించి తీసుకెళ్లారు.