మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించి..దేశం దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. ఎట్టకేలకు ఏక్ నాథ్ షిండేని సీఎంని చేశారు. కాగా గత కొన్ని రోజులుగా లగ్జరీ హోటళ్లలో గడిపారు రెబల్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారంతా ఇంటిబాట పట్టారు. రెబల్ ఎమ్మెల్యేలలో ఒకరిగా ఉన్నారు శ్రీనివాస్ వంగ. తాజాగా లగ్జీరీ హోటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే వర్షాకాలం కావడం.. వర్షాలు కురుస్తుండటంతో వెంటనే వ్యవసాయంలోకి దిగిపోయారు.
రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించిన ఆ రెబల్ ఎమ్మెల్యే ఇప్పుడు పొలంలోకి అడుగుపెట్టారు.ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు తలసారిలో పంట పొలాలు ఉన్నాయి. అక్కడే ఆయన తల్లి, తన భార్య, 14 ఏళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. పాల్ఘడ్‌లో వర్షాలు సాగుకు అనుకూలంగా కురుస్తున్నాయి. దీంతో ఆయన కూడా వ్యవసాయ క్షేత్రంలో దర్శనం ఇచ్చారు.శరద్ పవార్ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో ఉద్ధవ్ ఠాక్రే కూటమిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వంగ శ్రీనివాస్ ..ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే.