పర్యావరణ సమతూకం కోసం కప్పలను పరిరక్షించుకుందామని రాష్ట్ర ప్రజలకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. దక్షిణ గోవాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ”కప్పలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. పర్యావరణ సమతూకం పాటించాలని మనం ఆకాంక్షిస్తున్న పక్షంలో వాటిని(కప్పలు) మనం తప్పనిసరిగా కాపాడుకోవాలి. కప్పలను వేటాడటానికి ప్రయత్నించే వారిని అరెస్టు చేస్తాం. కప్పలను చంపవద్దు” అని అన్నారు.
ఇదే విషయమై ప్రజలకు ఒక సూచన చేస్తూ ”కప్పలను తినకండి. బదులుగా చికెన్ తినండి. సాగు భూమిలో సమతూకాన్ని పాటించడానికి కప్పలు చాలా ముఖ్యం” అని తెలిపారు. స్థానిక రెస్టారెంట్లు కప్ప మాంసాన్ని ‘జంపింగ్ చికెన్’ పేరుతో వండివడ్డిస్తున్న కారణంగా కప్పల వేట కొనసాగుతున్నది. కప్పల వేటను నిషేధిస్తూ ఒక చట్టం గోవాలో అమల్లో ఉంది. గోవాలో అనేక రకాల కప్పలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.