Saturday, November 23, 2024

రైళ్లలో ఖాళీల్లేవ్​, సంక్రాంతికి ఊరెళ్లడం ఎలా.. మూడు నెలల ముందే బుకింగ్​ పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుండి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ సారీ కష్టాలు తప్పేలా లేవు, పండుగకు ఇంకా మూడు నెలలు ఉండగానే అప్పడే ట్రయిన్లలో రిజర్వేషన్లన్నీ హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. వెయిటింగ్‌ లిస్టుల్లో అప్పడే 500 వందల నుండి 600 వరకు ఉండడంతో పండగకు ఊళ్లకు వెళ్లాలనుకుంటున్న నగర వాసులు నిరాశకు గురి అవుతున్నారు. సాధారణంగా రైళ్లలో మూడు నాలుగు నెలల ముందే రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. కానీ హైదరాబాద్‌ నుండి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్‌ అయ్యయి. సికింద్రాబాద్‌ నుండి తిరుపతి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో బెర్తులన్నీ భర్తీ అయ్యాయి. దీంతో ఈ సారి సొంతూళ్లకు వెళ్లడం మరిన్ని కష్టాలను తేకతప్పదంటున్నారు. రైళ్లు గనుక అందుబాటులో లేక పోతే ప్రైవేటు బస్సులే శరణ్యం కానున్నాయని, వారు విపరీతంగా టికెట్‌ రేట్లు యధేచ్చగా పెంచేస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి పెద్ద పండుగే

దక్షిణ భారతదేశంలోనే సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. జనవరి నెల రెండో వారంలో జరిగే ఈ పండుగకు ప్రతి ఒక్కరూ ఊళ్లకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు జనవరి 11 వ తేదీ ప్రయాణాలకు గాను ట్రైయిన్‌ టిక్కెట్టు బుకింగ్‌ను సెప్టంబర్‌ 13వ తేదీనే ప్రారంభించింది. సంక్రాంతి పండుగ ఈ సారి శుక్ర, శని, ఆదివారాల్లో రావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుండే జర్నీ ప్లాన్‌చేసుకుంటున్నారు. జనవరి నెల వచ్చిందంటే చాలు పండుగ గుర్తుకు వచ్చి అందరూ రైలు టిక్కెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌ సిటిసి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ లన సందర్శించి తీరా వందల సంఖ్యలో వెయిటింగ్‌ లిస్టు చూసి హతాశులవుతున్నారు. నిజానికి కోవిడ్‌ తర్వాత కాలం నుండి సొంతూళ్లకు వెల్లేందుకు నగర వాసులు ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ క్రమంలో రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి సాధారణ రోజుల్లో రెండు లక్షల మంది రాక పోకలు సాగిస్తుంటే పండుగల రోజుల్లో రెండు నుంచి రెండున్నల లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలే కాదు, మహారాష్ట్ర బీహార్‌, పాట్నా , తదితర ప్రాంతాల నుండి బతుకుదెరువు కోసం వేల సంఖ్యలో జనం హైదరాబాద్‌కు వచ్చి జీవిస్తున్నారు. వీరంతా కూడా పండుగలు తప్ప మిగతా సమయాల్లో హైదరాబాద్‌లో ఉంటూ కూలీ నాలీ పనులు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.

- Advertisement -

ట్రావెల్స్‌ భారాలు మోయలేం..

రైలు ప్రయాణాలు దొరక్క ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే ఇక పండుగ చేసినట్లేనంటున్నారు. సాధారణ రోజుల్లో ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయించే వారు పండుగ వేళ అందులో వెళ్లాలంటే వేలకు వేలు చెల్లించక తప్పదని చెబుతున్నారు. ఇద్దరు పిల్లలు, భార్య, భర్త ఇలా ఓ నలుగురితో ఉన్న ఒక కుటుంబం విజయవాడకో, విశాఖపట్నంకో వెళ్లాలంటే సరాసరిన రూ. 5 వేల వరకు ఖర్యు అవుతుందని, ప్రయాణాలకే వేలకు వెలు ఖర్చు అవుతుంటే.. పండుగకు ఇక కొత్త బట్టలు, పండగకు పిండి వంటలకు ఏలా ఖర్చులు పెట్టుకుంటామని వారు వాపోతున్నారు.

ప్రత్యేక రైళ్లు వేసినా అదనపు ఖర్చులు తప్పవని వారు చెబుతున్నారు. కార్మికులు, చిరువ్యాపారులు తాము అదనపు ఛార్జీల భారాన్ని మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుండి తిరుపతి వెల్లే వెంకటాద్రి, నారాయణాద్రి ట్రయిన్టు అయితే నెల క్రితమే బెర్తులన్నీ భర్తీ అయ్యాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement