Friday, September 6, 2024

Leakage – నీట్ పై లోక్ స‌భ‌లో గ‌రం గ‌రం – కేంద్రంపై విప‌క్షాలు మూకుమ్మ‌డి దాడి

విద్యా శాఖ మంత్రిపై రాహుల్ గాంధీ మండిపాటు
భార‌త ప‌రీక్ష వ్య‌వ‌స్థే ప‌చ్చి మోసం అంటూ ఆరోప‌ణ‌
డ‌బ్బున్న‌వాళ్లు చేతుల‌లో విద్యా వ్య‌వ‌స్థ‌
అన్ని ప‌రీక్ష‌ల ప్ర‌శ్న ప‌త్రాలు మార్కెట్ లో అమ్మ‌కం
పేదోడికి ఎప్ప‌టికీ దొర‌క‌ని ఉన్న‌త విద్య‌
విద్యా మంత్రి రాజీనామా చేయ‌ల్సిందే
లోక్ స‌భ‌లో విప‌క్షాలు ప‌ట్టు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – భార‌త ప‌రీక్ష వ్య‌వ‌స్థ పచ్చ మోసం అంటూ లోక్ స‌భ లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై ధ్వ‌జ‌మెత్తారు.. నేడు ప్రారంభ‌మైన బడ్జెట్ సమావేశాల‌లో దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్‌ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నీట్ అంశంపై మాట్లాడుతుంటే.. విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ , కేంద్రంపై విమర్శలు చేశారు. పేప‌ర్ లీక్ ల‌తో విద్యార్ధుల భ‌విష్య‌త్ తో ఆడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

- Advertisement -

విద్యావ్యవస్థను నాశనం చేశారు

పేపర్ లీకేజీలో రికార్డ్ సృష్టించారంటూ మండిపడ్డారు రాహుల్. నీట్ పరీక్ష కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవన్నారు .పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అని అన్నారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని మండిపడ్డారు . ఈ సమస్యను మూలాలనుంచి పెకిలించాలని సూచించారు. దేశంలో పరీక్ష విధానాలపై అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ భాధ్యతగా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షపై కేంద్రం బాధ్యత వహించాలన్నారు. ధనవంతులే పేపర్లు కొనుక్కుని డాక్టర్లు అవుతున్నారని మండిపడ్డారు.

ఈ పేపర్‌ లీక్‌లపై విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ”గత ఏడేళ్ల కాలంలో పేపర్‌ లీక్‌ జరిగిన దాఖలాలు లేవు. ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది” అని వెల్లడించారు.

ఈ ప్రభుత్వం పేపర్‌లీక్‌ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు.

ఇదిలాఉంటే.. కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement