ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పనా సోరెన్‌తో కలిసి హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ తదితులు పాల్గొన్నారు. విపక్ష నేతలను అరెస్ట్ చేస్తూ పాలక బీజేపీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తోందని నేతలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్ధానాలు గెలుచుకోవాలని కలలు కంటోందని, ఒక పార్టీ, ఒక వ్యక్తి సారధ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తాము ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసేందుకు రాలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏకమయ్యామని చెప్పారు. గతంలో అవినీతిలో కూరుకుపోయిన వారిని బీజేపీ వాషింగ్ మెషీన్‌లో శుభ్రం చేసి పునీతులను చేస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిపోయిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ సింహం…
కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలులో పెట్టారని ప్రధాని నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడని, నిజాయితీపరుడని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను అడిగారు. జైలుపాలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని, ఆయన రాజీనామా చేయాలా అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఆమె ప్రశ్నించారు. మీ కేజ్రీవాల్ సింహం లాంటి వాడని, ఆయనను ఎంతోకాలం కాషాయ పాలకులు జైల్లో బంధించలేరని సునీతా కేజ్రీవాల్ అన్నారు.
సిట్టింగ్ సీఎంను ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్ధం కాలేదని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసే ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను అరెస్ట్ చేశారని, ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ మోదీ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడికి తెగబడుతోందని దుయ్యబట్టారు.