Friday, November 22, 2024

రైల్వేలో ఉద్యోగుల తొలగింపు.. 16 నెలల్లో 177 మందిపై వేటు

రైల్వే అధికారులు, ఉద్యోగుల పనితీరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. విధుల్లో అలసత్వం, అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై రైల్వేశాఖ కొరడా ఝులిపిస్తోంది. ఇలాంటి కారణాలతో జులై 2021 నుండి ప్రతి మూడు రోజులకు ఒక అవినీతి రైల్వే అధికారిని తొలగించింది. ఈ లెక్కన గత 16 నెలలుగా 177 మంది అధికారులను తొలగించింది. అయితే వీరిలో కొందరిని స్వచ్ఛంద పదవీ విరమణ చేసేలా ఒత్తిడి తేవడం, మరికొందరిని నేరుగా సస్పెండ్‌ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌, మెడికల్‌, సివిల్‌ సర్వీస్‌ శాఖలలో విధులు నిర్వహిస్తున్న 139 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చి రైల్వే శాఖ వారిని ఇంటికి పంపించింది. 38 మందిని సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

అలాగే హైదరాబాద్‌లో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఉన్నతాధికారులను తొలగిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, కేంద్ర రైల్వే మంత్రిగా 2021లో బాధ్యతలు తీసుకున్న తర్వాత అశ్వినీ వైష్ణవ్‌ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. పనిచేయకుండా సంస్థకు భారంగా మారిన ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని చాలా సందర్భాలలో మంత్రి పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement