Monday, November 18, 2024

గూగుల్‌లో రోబోలకు లేఆఫ్‌..

వ్యయ నియంత్రణ పేరుతో గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు, రోబోలకు కూడా వర్తింప చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు కేఫిటేరియాలో క్లీనింగ్‌ కోసం ఉన్న రోబోలకు గూగుల్‌ ఉద్వాసన పలికింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. గూగుల్‌ ఎవ్రీడే రోబోట్స్‌ పేరిట ఓ ప్రాజెక్ట్‌ను 2019లో ప్రారంభించింది. ఇందులో భాగంగా వంద రోబోలను అభివృద్ధి చేశారు. ఒక చేయి, వీల్స్‌ కలిగిన ఈ రోబోట్లు ఒక చోట నుంచి మరో చోటుకు సులభంగా వెళ్ల గల వు. ఈ రోబోలను కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేసేందుకు, చెత్తను రీసైకిల్‌ చేయడానికి, డోర్లు తెరవడానికి వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో కాన్ఫరెన్స్‌ హాళ్లను శుభ్రం చేసేందుకు వీటిని గూగుల్‌ ఉపయోగించుకుంది.

- Advertisement -

రోబోలను నిర్వహించడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో, ఖర్చులు తగ్గించుకునేందుకు గూగుల్‌ ప్రస్తుతం వీటిని పక్కనపెట్టింది. ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ లాభదాయం కాదని భావించిన గూగుల్‌ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. ఇది ఇకపై ప్రత్యేక ప్రాజెక్ట్‌గా ఉండబోదని గూగుల్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ డెనిస్‌ గంబోవా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం వినియోగించిన టెక్నాలజీని, సిబ్బందిని గూగుల్‌ రీసెర్చ్‌లో భాగంగా ఉన్న మరో రోబోటిక్‌ ప్రాజెక్ట్‌లో విలీనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా గూగుల్‌ ఏకంగా రోబోలకే లేఆఫ్‌ ఇచ్చేసింది. 2023లో అన్ని టెక్‌ కంపెనీల్లో మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement