న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యాన్ని 350 పడకలకు కుదించడానికి భూకేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే కారణమని కేంద్ర కార్మిక మంత్రి రామేశ్వర్ తేలి అన్నారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి గురువారం సమాధానమిచ్చారు. విశాఖలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తొలుత సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత సిబ్బంది క్వార్టర్లకు అదనపు స్థలం అందుబాటులో లేకపోవడంతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో 350 పడకల ఆసుపత్రిగా మార్చారని ఆయన తెలిపారు.
ఈ ఆస్పత్రికి మంజూరైన మొత్తం రూ.384.26 కోట్లని వెల్లడించారు. ఈఎస్ఐసీ పేరిట ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి కేటాయింపు జరిగిందని, నిర్మాణ సంస్థకు పనులు అప్పగించడంతో పాటు ప్రాజెక్టు ప్రారంభం, పూర్తయ్యే తేదీని నిర్ణయించడానికి భూ కేటాయింపులో మార్పుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. విశాఖ మల్కాపురంలో ప్రస్తుతం 125 పడకల ఈఎస్ఐసీ ఆస్పత్రి మరమ్మతులో ఉందని, విశాఖ వెలుపల అచ్యుతాపురంలో మరో 30 పడకల ఆస్పత్రికి ఆమోదం లభించిందని ఆయన బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన మరో 8 ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ప్రధానమైనవి గుంటూరు, నెల్లూరు, పెనుకొండ, శ్రీసిటీలో ఉన్నాయని, వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్థలాలు కేటాయించలేదని వివరించారు. కేంద్రమంత్రి జవాబుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అనువైన స్థలాన్ని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్ల విశాఖపట్నం, ఇతర నగరాల్లో సంఘటిత కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు.