Saturday, November 23, 2024

రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు….

హైదరాబాద్‌, హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుంట శ్రీను టీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన నేత కావడంతో ఓ వైపు కాంగ్రెస్‌, మరోవైపు బీజేపీ నిరసనలకు దిగాయి. ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, ముట్టడిలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మంథని నుండి హత్యకు సంబంధించిన సెగలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ ఢిల్లిdని తాకాయి. జడ్పీఛైర్మన్‌తో పాటు పోలీసులతీరుపై రాజకీయపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పట్టపగలు..నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా కత్తులతో న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాద దంపతులను హతమార్చడంపై ప్రజలు తీవ్రంగా మండిపడు తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ నేతృత్వంలో పెద్దపల్లికి వెళ్ళి మృతదేహాన్ని సందర్శించగా, బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. డిజిపి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. మెరుపు ఆందోళనకు దిగిన మహిళానేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బండిసంజయ్‌ భగభగలాడారు. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ హత్యపై తీవ్రస్థాయిలో భగ్గుమనడంతో పాటు క్షేత్రస్థాయిలో నిరసనలకు దిగింది. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మండలి నేత జీవన్‌రెడ్డితో పాటు ఎంపీ రేవంత్‌ రెడ్డిలు హత్యను తీవ్రంగా ఖండించడంతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసులపై భగ్గుమన్నారు. న్యాయవాదులకు రక్షణలేదని, పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జడ్పీఛైర్మన్‌ పుట్టమధుపై చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ రామచందర్‌ రావు ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద మౌనదీక్ష చేపట్టారు. హత్యలో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ను విపక్షాలు ఇరుకున పెట్టే యత్నం చేయగా, నష్టనివారణ చర్యల్లో భాగంగా నిందితుడిని టీఆర్‌ఎస్‌ నుండి పార్టీ సస్పెండ్‌ చేసింది.
రాజ్‌భవన్‌కు ర్యాలీ.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
న్యాయవాదుల హత్యకు నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్ల ఆందోళనకు చేపట్టారు. సివిల్‌ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలు దేరగా, సైఫాబాద్‌ సమీపంలో లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ సస్పెండ్‌ చేయాలని లాయర్లు డిమాండ్‌ చేశారు. మల్కాజ్‌గిరి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నాంపల్లి, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి కోర్టుల్లో విధులు బహిష్కరించారు. నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో విధులు బహి ష్కరించిన లాయర్లు దోషును కఠినంగా శిక్షించాలంటూ నిన దించారు. న్యాయవాదుల హత్యను ఖండిస్తూ.. సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. దోషు లను కఠినంగా శిక్షించాలంటూ గళమెత్తారు. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట రహదారిపై లాయర్లు బైఠాయించారు. ధర్నాతో ఎల్బీనగర్‌ – దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.
సీఐడీకి బదిలీచేయండి: డీజీపీకి మాజీ సీఎస్‌ వినతి
న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో పారదర్శకత కోసం కేసును సీఐడీకి బదిలీ చేయాలని, ఇందుకోసం సీనియర్‌ అధికారులతో సిట్‌ని ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. అభియోగ పత్రాలు దాఖలు చేసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ట్రయల్‌ చేసి నిందితులకు కఠిన శిక్ష అమల య్యేలా చూడాలని కోరారు.
లాయర్ల రక్షణకు చట్టం: ఎమ్మెల్సీ రామచందర్‌ రావు
న్యాయవాదుల రక్షణకోసం చట్టం తేవాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద బీజేపీ మౌనదీక్ష చేపట్టింది. న్యాయవాద దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
టీఆర్‌ఎస్‌ నుండి కుంట శ్రీనివాస్‌ సస్పెండ్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి మంథని మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కుంట శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటించారు. లాయర్‌ దంపతులను పట్టపగలు హత్యచేసిన కేసులో కుంట శ్రీనివాస్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం వెళ్ళి హత్యలో పాల్గొ నడంతో టీఆర్‌ఎస్‌ వర్గాలే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement