ఆంధ్రప్రభ , హైదరాబాద్ : టిఎస్ ఆర్‌టిసిలో వివిధ సేవలను డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ‘ టిఎస్ ఆర్‌టిసి ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్ ‘ యాప్‌ను ఆయన ప్రారంభించారు. డిజిటలైజేషన్ పరివర్తనలో భాగంగా సంస్థ ఛైర్మన్ , ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలతో యాప్‌ను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. సంస్థ అంతటా ఉద్యోగులను కవర్‌చేసే ఈ డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ను రూపొందించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత సౌకర్యవంతంగా ఉండటం కోసమేనని విసి సజ్జనార్ అన్నారు.
పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా 3 డిపోల ( బర్కత్‌పుర, కంటోన్మెంట్, హైదరాబాద్-2 )లో పరిశీలించటం జరుగుతుందని, స్మార్ట్‌ఫోన్ ఉన్న ఏ ఉద్యోగి అయినా టిఎస్ ఆర్‌టిసి యాప్‌ని ఉపయోగించుకోవచ్చని, వారి రోజువారీ హాజరు, సెలవులు, పే స్లిప్‌లు, స్వంత సమాచారాన్ని పొందేందుకు ఈ యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా యాప్ తదుపరి వెర్షన్‌లలో మరిన్ని ఫీచర్లను కలిగి ఉండేలా రూపొందించనున్నట్లు తెలిపారు. సంస్థలో ఎక్కువ మంది ఉద్యోగులతో తక్షణమే సంభాషించడానికి , సర్క్యులర్‌లను పంచుకోవడానికి, నోటిఫికేషన్‌లతో పాటు అవసరమైన ప్రభుత్వ నివేదికలను ఒకే చోట అందుబాటులో ఉంచడానికి సహాయపడుతుందని సజ్జనార్ వివరించారు. ప్రస్తుత డిజిటలైజ్ యుగంలో ఈ ప్లాట్ ఫారమ్‌ను కలిగి ఉండటం వల్ల సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ఒకే కుటుంబంగా తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
సంస్థ ప్రతిష్టను పెంచడానికి అదనపు అడుగులు (ఎక్స్‌ట్రా మైల్ ) వేసే ఉద్యోగులను ఈ యాప్ ద్వారా తక్షణం గుర్తించడం జరుగుతుందన్నారు. ఇందులో స్పూర్తిగా నిలిచిన ఉద్యోగుల వివరాలను మొత్తం సిబ్బంది వీక్షించడం వల్ల అవార్డు గ్రహీతలకు గర్వంగా ఉంటుందని, తద్వారా రవాణా సేవలో తమ వంతు కృషి చేసేందుకు తోటి ఉద్యోగులు ప్రేరణ పొందగలరని ఆశిస్తున్నట్టు సజ్జనార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సంస్థలోని ఉద్యోగులందరికీ ‘ ఒక గొప్ప మార్పు కు ఇదే శ్రీకారం ‘ అనే శిక్షణా కార్యక్రమం ద్వారా వారి స్వీయ అభివృద్ధి, సంస్థ అభివృద్ధి కొరకై నిపుణుల సలహాలు ఇవ్వడం ద్వారా మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు.
ప్రయాణికుల సమస్యలను అనుభవాలను నేరుగా తెలుసుకునే విధంగా రూపొందించిన ‘ ప్రజల వద్దకు ఆర్‌టిసి ‘ అనే కార్యక్రమం ద్వారా సంస్థ ప్రయాణికులకు అందించే సేవలను వివరించి వారి రవాణా అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. సంస్థలోని ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ‘ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ‘ కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి వార్షిక ఆరోగ్య తనిఖీని డిపో స్థాయిలో టిఎస్ ఆర్‌టిసి వైద్య బృందం సజావుగా నిర్వహిస్తుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తద్వారా నిపుణులు ఇచ్చిన సలహాలు పాటిస్తూ ప్రతి ఉద్యోగి తన జీవన విధానాన్ని మార్చుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఉద్యోగి సమస్యలన్నింటినీ కచ్చిత సమయంలో పరిష్కారాన్ని కలిగి ఉండేలా మరియు ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి మరిన్ని సదుపాయాలను ఆ యాప్ లో జోడించాలని యోచిస్తున్నట్లు సంస్థ ఎండి విసి సజ్జనార్ వెల్లడించారు.