Monday, October 21, 2024

Last T 20 – భారత్ క్లీన్ స్వీప్ – బంగ్లాదేశ్ వైట్ వాష్

బంగ్లాదేశ్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన చివరిదైన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల రికార్డ్ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 7 వికెట్లను 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ 3-0 తో సిరీస్ గెలుచుకుంది.మెరుపు సెంచరీతో సత్తా చాటిన సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకు ముందు రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0 తేడాతో గెలుచుకోవడంతో ఈ టూర్ లో బంగ్లా విజయం లేకుండానే ముగించింది.

298 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలోనే 59 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా నితీష్ కుమార్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లో లిటన్ దాస్ (42) చెలరేగి 5 బౌండరీలు బాదాడు.ఆరో ఓవర్ లో బిష్ణోయ్ వికెట్ మెయిడీన్ తో బంగ్లా జోరుకు కళ్లెం వేశాడు.

- Advertisement -

ఇక్కడ నుంచి బంగ్లా స్కోర్ వేగం నెమ్మదించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హృదయ్(63*) మరో ఎండ్ లో పోరాడాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఏ దశలోనూ చేరుకోలేకపోయింది.

భారత బౌలర్లలో బిష్ణోయ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మయాంక్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (47 బంతుల్లో 111: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీకి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(35 బంతుల్లో 75: 8 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైనా చివర్లో హార్దిక్ పాండ్య (47), రియాన్ పరాగ్ (34) బ్యాట్ ఝళిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ కు మూడు వికెట్లు దక్కాయి. ముస్తాఫిజుర్ రెహమాన్,తస్కిన్ అహ్మద్,మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement