ప్రభన్యూస్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఇటీవల పోలీసు టాస్క్‌ఫోర్స్ సిఐ వెంకటేష్ నేతృతంలోని బృందం దాడులు నిర్వహించింది. గ్రామంలోని పలు దుకాణాలలో పెద్ద మొత్తంలో కల్తీ టీపౌడర్‌ను సాధీనం చేసుకున్నారు. ఆరా తీయగా కోస్గి మండలం సంపల్లి గ్రామానికి చెందిన మల్లిఖార్జున్ కల్తీ టీపౌడర్‌ను తయారీ చేస్తున్నట్లు తేలింది. మల్లిఖార్జున్ ఇంటిపై దాడులు చేయగా 20 క్వింటాళ్ల కల్తీ టీపౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ టీపౌడర్ తయారీకి వినియోగించే హానికరమైన రసాయినాలను..రంగులను కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత మూడేళ్లుగా మల్లిఖార్జున్ ఈ దందాలో ఉన్నట్లు తేలింది. జిల్లాలోని కోడంగల్..పరిగి ప్రాంతాలలో ఉన్న కిరాణా దుకాణాలకు కల్తీ టీపౌడర్‌ను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. మల్లిఖార్జున్ నుంచి కొనుగోలు చేసిన కల్తీ టీపౌడర్‌ను కిరాణా దుకాణాలలో కిలో రూ.120కి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ టీపౌడర్‌ను ఎక్కువగా రోడ్ల పక్కన టీ దుకాణాలను నడిపించే వ్యక్తులతో పాటు గ్రామీణ ప్రాంతాలలో హోటళ్లను నిర్వహించే వారికి విక్రయిస్తున్నారు.
తేయాకు తోటలలో రాలిపోయిన ఆకులను సేకరించి కొందరు వ్యక్తులు నాసిరకం టీపౌడర్‌ను తయారు చేస్తున్నారు. వారి నుంచి నాసిరకం టీపౌడర్‌ను కొనుగోలు చేస్తున్న మల్లిఖార్జున్ అందులో రసాయినాలను..రంగులను కలిపి కల్తీ టీపౌడర్‌ను తయారు చేస్తున్నాడు. తన ఇంట్లో ఏకంగా చిన్నపాటి యంత్రాలతో కూడిన పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కాటేదాన్ నుంచి రసాయినాలను, రంగులను తీసుకవచ్చి కల్తీ టీపౌడర్‌ను తయారు చేస్తున్నాడు. రసాయినాలు..రంగులను వాడి తయారు చేసిన టీపౌడర్‌తో సిద్దం చేసిన టీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. చక్కటి రుచితో పాటు క్షణాల్లో రంగు రావడంతో ప్రజలు ఎగబడి తాగుతున్నారు. అది అంతా కూడా రసాయినాలతో వస్తున్నట్లు పోలీసు టాస్క్‌ఫోర్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. కల్తీ టీపౌడర్ తయారీకి వినియోగిస్తున్న రసాయినాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
జిల్లాలో మల్లిఖార్జున్‌తో పాటు మరికొన్ని ముఠాలు కల్తీ టీపౌడర్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు రాజమండ్రి నుంచి కల్తీ టీపౌడర్‌ను తీసుకవచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. ఈ ముఠాలను పట్టుకునేందుకు పోలీసు టాస్క్‌ఫోర్స్ బృందాలు గట్టి నిఘా వేసి ఉంచాయి. జిల్లాలో మొదటిసారి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బృందం భారీ కల్తీ టీపౌడర్ తయారీ..విక్రయాల ముఠాలను పట్టుకుంది. కల్తీ టీపౌడర్ మాఫియా ఆగడాలకు టాస్క్‌ఫోర్స్ మూకుతాడు వేయడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీపౌడర్ కల్తీని గుర్తించేందుకు ఒక గ్లాస్‌లో నీటిని తీసుకొని టీపౌడర్‌ను వేయాలి. కొద్ది నిమిషాలలో నీరు ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ టీపౌడర్‌గా భావించాలి అని పోలీసులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..