గత నెల (మే)లో శ్రీవారి భక్తుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. ఏకంగా రూ.130.29 కోట్లకుపైగా హుండీ వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో రెండేళ్లుగా వెంకన్న దర్శనాలు లేకుండా పోయాయి.. అయితే ఈసారి వేసవి సెలవులు రావడం.. మే నెలలో సెలవులతో రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని 22,62,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 1.86 లక్షలకు పైగా లడ్డూలు అమ్ముడుపోయాయని, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో 47 లక్షల మంది భక్తులు ‘అన్నప్రసాదం’ తీసుకున్నారని తెలిపారు. అదే నెలలో పీఠాధిపతికి కేశవదానంలో భాగంగా 10,72,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.
కాగా.. శని, ఆదివారాల్లో తిరుమలలో అనూహ్య రద్దీ ఉండే అవకాశం ఉందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీకెండ్‌లో స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, రద్దీ ఎక్కువగా ఉన్నందున శ్రీవారి దర్శనం కోసం ఓపికగా వేచి ఉండాలని ఆయన కోరారు. మరోవైపు తమిళనాడుకు చెందిన భక్తులు టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు రూ.10కోట్లను విరాళాల రూపంలో అందజేశారు. చెన్నైకి చెందిన సరోజా సూర్య నారాయణన్ అనే మరో భక్తురాలు వజ్రాలు పొదిగిన బంగారు దారాన్ని, రూ.2.45 కోట్ల విలువైన 4.150 కిలోల బంగారు హారాన్ని విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.