కొలంబో : దీపదేశం శ్రీలంకలో ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినప్పటికీ వారు శాంతించలేదు. అధ్యక్షుడు గొటబాయ అధికార నివాసానికి సమీపలో కొన్ని వారాలుగా శాంతియుతంగా పోరాడుతున్న తమపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడటంతో దేశమంతటా ప్రజలు రగిలిపోయారు. సోమవారం రాత్రినుంచి హింసాత్మకంగా మారిన నిరసనల్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. మరో 215మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని కొలంబోలో నిశ్శబ్దం తాండవిస్తూండగా మిగతా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్థరాత్రి దాటాక మాజీ ప్రధాని మహింద రాజపక్సే అధికార నివాసంలోకి వేలాదిమంది నిరసనకారులు జొరబడేందుకు విఫలయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కనీసం పది పెట్రోల్ బాంబులను భవనంలోకి నిరసనకారులు విసిరినట్లు గుర్తించారు. భారీవిధ్వం సం, మంటలు చెలరేగడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. తెల్లవారుఝామున సైనికుల రక్షణలో ప్రత్యేక హెలికాప్టర్‌లో మహింద రాజపక్సే కుటుంబం ట్రింకోమలీ నౌకా స్థావరానికి పలాయనం చిత్తగించింది. ట్రికోమలి నౌకాకేంద్రంలో రాజపక్సే తలదాచుకున్నట్లు గుర్తించిన నిరసనకారులు బయట పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. దాంతో అక్కడి పరిస్థితి ఉ ద్రిక్తంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశమంతటా కర్ఫ్యూను మరో రెండురోజులు పొడిగించారు. సైన్యానికి అపరిమిత అధికారాలు ఇచ్చారు. రాజధానిలో వేలాదిమందితో కూడిన బలగాలు మోహరించాయి. ముందస్తు హెచ్చరికలు, నోటీసులు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసేందుకు అనుమతిచ్చారు. కాగా నేడు, రేపు సారత్రిక సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. కాగా సోమవారంనాడు ఆందోళనకారులపై కాల్పులకు తెగబడిన ఎంపీ అమరకీర్తి ఆ తర్వాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా సోమవారంనాటి అల్లర్లలో అధికారపక్షానికి చెందిన నేతలు, అధికారులకు చెందిన 41 భవనాలను, వందలాది వాహనాలను నిరసనకారులు తగలబెట్టారు.
అన్నివర్గాలు ఐక్యంగా…
తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ సమస్య పరిష్కారానికి రాజపక్సే ప్రభుతం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీలంక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాల ప్రజలు ప్రభుత వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైనారు. బౌద్దులు, తమిళులు, ఇతర మతాలవారు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. తొలిసారిగా మధ్యతరగతి వర్గాలు కూడా వీరితో జతకలిశాయి. నిత్యావసర వస్తవుల కొరత, అధిక ధరలు, ప్రజారవాణా నిలిచిపోవడం, పెట్రోలు, డీజిల్ కొరత, రోజులో సగానికి సగం సమయం విద్యుత్ కోతలు విధించిన నేపథ్యంలో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని విపక్షాలు మద్దతు ఉహసంహరించాయి. అయినా రాజపక్సే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూండటంతో ప్రజలు ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. శ్రీలంకలో సింహళీయులకు, తమిళలకు మధ్య అంతరం ఉంది. అలాగే బౌద్ధులకు-ఇతర మైనారిటీ వర్గాలకు విభేదాలున్నాయి. కానీ ప్రస్తుతం అవన్నీ మరచి కలసికట్టుగా ఉద్యమిస్తూండటం విశేషం.
ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం నో..
ప్రధాని మహింద రాజపక్స రాజీనామా నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అఖిలపక్షంతో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షం సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) తిరస్కరించింది. దేశాధ్యక్షుడు కూడా పదవినుంచి వైదొలగాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలు కొనసాగాయి. రాజపక్సే కుటుంబం దేశంనుంచి పారిపోకుండా అడ్డుకునేందుకు వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఎక్కడికక్కడ ప్రజలే
చెక్‌పాయింట్లు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహింద రాజపక్సే రాజీనామా చేసినప్పటికీ పరిస్థితుల్లో పెద్దమార్పు లేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధ్యక్షుడు గొటబాయ ఉన్నారు. కాగా వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడిని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..