అంతరించే దశలో ఉన్న భాషల పరిరక్షణ కోసం కేంద్రం ఓ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర విద్యాశాఖ 2013లో దీన్ని ప్రారంభించింది. దేశంలో అంతరించే దశలో ఉన్న, మున్ముందు అంతరించే ప్రమాదంలో ఉన్న భాషలను గుర్తించి రిపోర్టు రూపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కర్నాటకలోని మైసూరులో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తోంది.
పథకంలో భాగంగా 10 వేల కన్నా తక్కువ మంది మాట్లాడే భాషలను గుర్తించి పరిరక్షించే చర్యలు చేపడతారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 117 భాషలను గుర్తించారు. వాటిని డాక్యుమెంటేషన్ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీల్లో ఈ భాషల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఆర్థికంగా సాయం చేస్తోంది.