Friday, November 22, 2024

‘ధరణి’తో భూములు దోచుకున్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ ద్వారా టీఆర్ఎస్ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ. హనుమంత రావు (వీహెచ్), రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోదండ రెడ్డి ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తొలుత మాట్లాడిన కోదంద రెడ్డి, ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు.

పట్టా భూములు, ఇందిరాగాంధీ పంచిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి 24 లక్షల కుటుంబాల భూములకు పట్టాలు లేకుండా చేశారని విమర్శించారు. నిరుపేదల భూములను టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కబ్జా చేశారని దుయ్యబట్టారు. దేశంలోనే అతిపెద్ద భూకంభకోణంగా ఆయన అభివర్ణించారు. రెవెన్యూ రికార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 120 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, ఈ క్రమంలో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ రికార్డును విదేశీ కంపెనీకు ఎలా ఇస్తారని కోదండ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిన భూములను వేలం వేస్తోందని మండిపడ్డారు.

నైజాం భూములు కూడా కబ్జాకు గురయ్యాయి
ఒక్క గుంట కూడా పోనివ్వమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ పూర్తిగా అవకతవకలతో నిండిపోయిందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ధరణి పోర్టల్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైజాం నుంచి వచ్చిన భూములు కూడా కబ్జాకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. పేదల భూములను టిఆర్ఎస్ నాయకులు అక్రమంగా దోచుకున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

పాదయాత్ర చేస్తా
‘ధరణి’ పోర్టల్ అక్రమాలపై సీనియర్ నేత వీహెచ్ కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని, ఈ అక్రమాలను మరింత వెలుగులోకి తీసుకొస్తానని ఆయనన్నారు. తన పాదయాత్రకు రేవంత్ రెడ్డి కూడా మద్ధతివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement