హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరోదఫా భూ వేలానికి రంగం సిద్ధమైంది. హెచ్‌ఎండీఏ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. పన్నేతర ఆదాయార్జనలో భాగంగా భారీ రాబడికి ప్రణాళికలు వేసుకున్న ప్రభుత్వం తాజాగా రంగారెడ్డి, మేడ్చేల్ మల్కాజ్‌గిరీ, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల వేలానికి శ్రీకారం చుట్టింది. 300గజాలనుంచి 10వేల చదరపు గజాల విస్తీర్ణ కల్గిన భారీ సైజ్ ప్లాట్లను విక్రయించేందుకు రెడీ అవుతోంది. వేలంలో పాల్గొనేందుకు జనవరి 16 రిజిస్ట్రేషన్ గడువుగా నిర్దేవించిన హెచ్‌ఎండీఏ జనవరి 4, 5, 6 తేదీలలో ప్రి బిడ్ సమావేశాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసింది. జనవరి 18న హెచ్‌ఎండీ ఈ భూములను వేలంద్వారా విక్రయించనున్నది.
రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను డెవలప్‌చేసి రూ.వేల కోట్ల లక్ష్యం దిశగా రంగంలోకి దిగింది. గతేడాది కోల్పోయిన పన్నేతర ఆదాయా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నిఏవదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నది. తద్వారా రూ. 20వేల కోట్ల లక్ష్యం చేరేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది.
హెచ్‌ఎండీఏ లేఅవుట్ల ప్లాట్ల వేలం జనవరి 18న…
మరోసారి హెచ్‌ఎండీ అభివృద్ధి చేసిన లే అవుట్లలో పాట్ల ఆన్‌లైన్ వేలంతో భారీ రాబడికి ప్రభుత్వం సన్నద్ధమైంది. నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను జనవరి 16దాకా స్వీకరించనున్నారు. ఆ తర్వాత లాటరీల ద్వారా ప్లాట్ల కేటాయింపులకు రంగం సిద్థం చేశారు. కొనుగోలుదారుల కోసం ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించి,, లే అవుట్ల ప్రత్యేకతను వివరించేందుకు సన్నాహాలు పూర్కతి చేశారు. ఆయా హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల వేలంతో ఈ దఫా రూ. 6500కోట్ల ఆర్జనకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
ఇక వరుసగా జిల్లాల్లోనూ…
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు తీసుకున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ.6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తోంది. ఒకవైపు భూముల విక్రయంతోపాటుగానే మరోవైపు గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తో కూడా రాబడే…
లే అవుట్లలో ఇప్పటివరకు విక్రయించకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉంటే అలాంటివారికి తాజా ఎల్‌ఆర్‌ఎస్ వర్తించకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీటికి భవన నిర్మాణ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలతోపాటు 33శాతం ఆంపౌండ్ ఫీజులను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. లే అవుట్ల క్రమబద్దీకరణతో పోల్చితో ఇవి మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన లే అవుట్లలో 1.31 లక్షల ప్లాట్లలో ఇంకా 40వేల ప్లాట్లు విక్రయించకుండా మిగిలిపోయాయి.
సొంతంగా లే అవుట్లు…
మరోవైపు ఇలా క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం స్కెచ్ వేసింది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఈ ఏడాది పన్నేతర ఆదాయాల్లో భాగంగా భూముల అమ్మకాలతో రూ. 25,421కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు రూ. 8400కోట్ల రాబడే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్ కింద 2500ఎకరాలతో రూ. 10వల కోట్లను పొందేలా ప్లాన్ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్ భూములపై కూడా సర్కార్ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.