Wednesday, January 29, 2025

Land Survey – హ‌క్కుదారుల‌కు స్వామిత్ర! డ్రోన్​ టెక్నాలజీతో పకడ్బందీగా భూ సర్వే

ఆస్తుల నిర్ధారణ సమర్థవంతంగా చేపడుతున్న కేంద్ర సర్కారు
మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్​, హర్యానా రాష్ట్రల్లో పూర్తి
3.17 లక్షల గ్రామాల్లో భూముల మ్యాపింగ్​కు చర్చలు​
1.53 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి
అర్హులైన లబ్ధిదారులు 2.25 కోట్ల మంది ఉన్నట్టు గుర్తింపు
తొలి విడతగా 65 లక్షల మందికి భూ హక్కు పట్టాలు
వర్చువల్​ విధానంలో హక్కు పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ
రీ సర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలు
కాడస్టల్​ మ్యాప్​ల డిజిటలైజేషన్ పూర్తికి సన్నాహాలు​
భూములకు యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్​

ఆంధ్రప్రభ, సెంట్రల్​ డెస్క్​:

సొంత భూమి ఉన్నా.. దానికి సంబంధించిన ఎలాంటి ప‌ట్టా లేకపోవడంతో దేశంలో ఎంతోమంది పేద‌లు ఇబ్బందులకు గురవుతున్నారు. వారి భూముల్లోనే పంటలు పండించినా దానికి చెందిన హక్కు పత్రాలు లేక అగచాట్లకు గురవుతున్నారు. అయితే.. ఇట్లా అర్హులైన లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను అందించేకుందుకు కేంద్ర ప్ర‌భుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. స్వామిత్ర యోజ‌న‌ పథకం ద్వారా సమర్థవంతంగా భూముల సర్వే చేపట్టి మ్యాపింగ్​ చేయడంతోపాటు ఆ భూమి సొంతదారులకు హక్కు పత్రాలను అందజేస్తోంది. ఇట్లా.. దేశవ్యాప్తంగా తొలి దశలో 65 లక్షల మందిని భూ హక్కు పత్రాల లబ్దిదారులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ ప్రాపర్టీ కార్డులను ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలోనే అంద‌జేశారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించడానికి 2020 ఏప్రిల్ 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాల్లో మ్యాపింగ్​ కొనసాగుతోంది.

- Advertisement -

డ్రోన్ టెక్నాలజీతో సర్వే..

ఈ పథకం కింద అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో భూముల సర్వే జరుగుతోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానా సహా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇలాంటి సర్వే పూర్తయింది. మొత్తం 3.17 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూములను మ్యాపింగ్ చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఇప్పటకే చాలా ప్రాంతాల్లో సర్వే కంప్లీట్​ చేసినట్టు తెలుస్తోంది.

1.53 లక్షల గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తి..

ఈ క్రమంలో ఇప్పటివరకు డ్రోన్​ సర్వే ద్వారా 1.53 లక్షల గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తయింది. అర్హులైన లబ్దిదారులు మొత్తంగా 2.25 కోట్ల మంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. తొలి విడతలో భాగంగా ఇందులో 65 లక్షల మందికి ప్రధాని మోదీ భూ హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంద‌జేశారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. భూములు కలిగి ఉండి హక్కు పత్రాలు లేక ఎవరూ ఆందోళన చెందవద్దని, అందుకోసమే ఈ సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. ఎవరి భూములకు వారే హక్కుదారులుగా ఉండేందుకు స్వామిత్ర యోజన పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీంతో హక్కు పత్రాలు పొంది బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.

గతంలో ఏపీలో సర్వే..

గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు, డిజిటల్ పద్ధతుల్లో భూముల సర్వే చేయడం, వాటిని మ్యాపింగ్ చేయడం అనేది ఏపీలోనూ గతంలో కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు.

రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలు..

అటు కేంద్ర ప్రభుత్వం కూడా భూములను రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ దీన్ని పొందుపరిచింది. ఏకంగా 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామ‌ని అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

రాష్ట్రాలకు అదనపు నిధులు..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ సంబంధిత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు అదనపు నిధులను ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.

భూ సంస్కరణలు..

భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్ మెంట్లను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

కాడాస్టల్ మ్యాప్‌ల‌ డిజిటలైజేషన్

అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ULPIN) లేదా భూ-ఆధార్ అసైన్‌మెంట్‌, కాడాఫ్రల్ మ్యాప్‌ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్-డివిజన్ల సర్వే, ల్యాండ్ రిజిస్ట్రీ అండ్ లింక్.. వంటివి గ్రామీణ భూ సంబంధిత చర్యల్లో ఉంటాయని సీతారామన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement