Saturday, November 23, 2024

Big Story | ‘రియల్‌’గా భూ వ్యాపారమే.. 13వేల ఎకరాల గుర్తింపు, 12 జిల్లాల్లో దందాకు శ్రీకారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది భూ వియాలకు కీలకం కానుంది. 13వేల ఎకరాల విక్రయంతో లక్ష్యం చేరేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. రూ.15,800కోట్ల ఆర్జనకు వీలుగా భూ బ్యాంక్‌ను రెడీ చేస్తున్నది. గతంలో ఏనాడూ లేనంతగా అనేక జిల్లాల్లో భూ సమీకరణకు మార్గం సుగమం చేసుకున్న ప్రభుత్వం వీలైనంత తొందర్లో రంగంలోకి దిగనున్నది. ఇప్పటికే 12వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ సమకూరిందని తెలుస్తోంది. నిరర్ధక భూముల విక్రయంతో రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనపర్చుకోవడం, న్యాయపరమైన పోరాటం, మిగులు భూముల గుర్తింపు, విక్రయం, భూ సమీకరణతో వెంచర్లు వేసి పూలింగ్‌ విధానంతో రాబడి ఆర్జన వంటివాటిపై ఆలోచనలు చేస్తోంది.

ఇప్పటికే హౌజింగ్‌ బోర్డు రద్దుతోపాటు, ఈ బోర్డుకు చెందిన 8047 ఫ్లాట్లు, 416 ఇండ్లను మెజార్టీ శాతం విక్రయించారు. తాజాగా 3వేల ఎకరాల దిల్‌ భూములనూ ఇందుకు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల 12 జిల్లాల్లోని 12 వేల ఎకరాలను గుర్తించినట్లు తెలిసింది. ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీలో భాగంగా కొందరు భూ యజమానులు ప్రభుత్వరంగ సంవస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. అసైన్డ్‌ భూములపై కూడా ఇటువంటి కార్యాచరణ జరుగుతోంది. ఇది వాస్తవంలోకి వస్తే భారీగా రాబడి ఖజానాకు చేరనున్నది.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను డెవలప్‌చేసి రూ. వేల కోట్ల లక్ష్యం దిశగా రంగంలోకి దిగింది. గతేడాది కోల్పోయిన పన్నేతర ఆదాయా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నిఏవదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నది. తద్వారా రూ. 20వేల కోట్ల లక్ష్యం చేరేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది.

వరుసగా జిల్లాల్లోనూ…

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు తీసుకున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ. 6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తోంది. ఒకవైపు భూముల విక్రయంతోపాటుగానే మరోవైపు గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు.

సొంత లే అవుట్లు…

ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్‌ కింద 2500ఎకరాలతో రూ. 10వేల కోట్లను పొందేలా ప్లాన్‌ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.

త్వరలో సర్కార్‌ ఖాతాకు…

త్వరలో సర్కార్‌ ఖాతాకు చేరనున్న అత్యంత విలువైన దాదాపు రూ. 50వేల కోట్ల ఆదాయాన్నిచ్చే అవకాశం ఉన్న ఈ భూములను వేలంతో విక్రయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఏడాది చాలా కీలకం కావడంతో ఆదాయ వనరులకు మార్గాలను అన్వేషిస్తున్న సర్కార్‌కు ఇది కీలకంగా మారనుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్త పథకాలకు భారీగా నిధుల అవసరం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రూ. 50వేల కోట్లు ఆశలు చిగురింపజేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement