కోకాపేటలో మిగిలిపోయిన భూముల విక్రయానికి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వే నంబర్ 239, 240లలో మెచ్‌ఎండీఏ ఏజెన్సీగా అమ్మకాలకు ఆదేశాలు జారీ చేసింది. గత వేలంలో ఒక్కో ఎకరాకు రూ.60.2 కోట్లకు మించి ధర పలికినట్లుగా హెచ్‌ఎండీఏ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల విక్రయంలో పారదర్శకత, మరింత రాబడి దిశగా సర్కార్ కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది. భూముల విక్రయాల సమీక్ష, ఎప్పటికప్పుడు ఆదేశాలకు, సకాలంలో విక్రయాలు జరిపేందుకు వీలుగా సీఎస్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, గృహనిర్మాణ, పురపాలక, పరిశ్రమలు, న్యాయశాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులను నియమించింది. టీఎస్‌బీపాస్ విధానంలో అన్ని అనుమతులు జారీ చేస్తారు. బహిరంగ వేలంలో విజయం సాధించిన బిడ్డర్‌కు పూర్తి నిధులను చెల్లించిన మూడు వారాల్లోగా జిల్లా కలెక్టర్ ఆ భూమిని వారికి స్వాధీనం చేసి కన్వేయన్స్ డీడ్‌ను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మార్కెట్ పరిస్థితులు, డిమాండ్‌కు తగ్గట్లుగా విక్రయాలకు సిద్దంగా ఉన్న భూములను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ధేశించారు. బహిరంగ వేలం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఈ కామర్స్ సంస్థ ఎంఎస్‌టీసీ సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ మార్కెట్ ఏజెన్సీ సహకారం తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజోపయోగ అవసరాలులేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశం ఉన్న భూములను ఒక్కో జిల్లాలో 1000 ఎకరాలను గుర్తించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ కమిటీ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమావేశమై రాబడి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఈ మేరకు అన్ని రాబడి శాఖలు వివరాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, భూముల విక్రయాలు, నూతన ఆబ్కారీ పాలసీ, ఇసుక ఆదాయం, వాహన పన్నులు, ఆస్తి పన్నులు వంటి అంశాలపై చర్చించనుంది.
ఎక్కువ ధర కోట్ చేసి బిడ్‌ను దక్కించుకున్న బిడ్డర్‌కు లే అవుట్లు వేసుకునేందుకు బహిరంగ వేలానికి ముందుగా అవకావం ఇవ్వనున్నారు. బహిరంగ వేలంలో వచ్చిన బిడ్లను పరిశీలించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో కమిటీని నియమించ నున్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా భూముల కమిటీలు కూడా విస్తృతంగా పనిచేయనున్నాయి. వివాదాలను తొలగించి, భూములను బహిరంగ వేలానికి అందుబాటులో ఉంచడం వంటి పనులను న్యాయశాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ ప్రతినిధి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల వాఖ ఐజీ, సంబంధిత జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణ చేస్తారు. భూముల సరిహద్దులను గుర్తించి వివాదాలను తొలగిస్తారు. బహిరంగ వేలానికి ముందే భూముల అభివృద్ధి, స్పష్టమైన హద్దులతో లే అవుట్ల రూపకల్పన, టీఎస్‌బీపాస్ అనుమతులకు అనుమతుల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ, జలమండలి ఎండీ, అగ్నిమాపక డీజీ, కాలుష్య నియంత్రణ మండలి సబ్య కార్యదర్శి ఉన్నారు. ఈ కమిటీ అనుమతులు, భూముల వినియోగ మార్పిడి, నీటి సదుపాయాలు, విద్యుత్ వసతులను సమకూరుస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital