Friday, November 22, 2024

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మం – ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

దాణా కుంభ‌కోణం కేసులో బెయిల్ పై బ‌య‌ట ఉన్నారు రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్. కాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. దాంతో ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూతో పాటు వైద్యుల బృందం, అతని పెద్ద కుమార్తె కూడా ఉన్నారు. కాగా లాలూ ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో అతని కుడి భుజం ఫ్రాక్షరైంది. దాంతో లాలూను కుటుంబ సభ్యులు పాట్నాలోని పరాస్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఆ ప్రాంతంలో కట్టుకట్టారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు.

యాదవ్ ఇప్పటికే షుగర్‌తోపాటు మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో సహా పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా లాలూ యాదవ్ ఆరోగ్య స్థితి స్థిరంగా ఉందని అతని కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పారు. మరీ అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ వైద్య ఖర్చులను రాష్ట్రమే భరిస్తుందని, అది ఆయన హక్కు అని బీహార్‌ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్‌ అన్నారు.మేము పాత సహచరులం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని నితిశ్ అన్నారు. లాలూ ప్రసాద్ 1990 నుంచి1997 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బీహార్‌లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 60 లక్షల జరిమానా విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement