Monday, November 18, 2024

Exclusive | విప్ల‌వ‌యోధుడికి లాల్​ సలామ్​.. గద్దర్​తో అనుబంధాన్ని యాది చేసుకుంటున్న‌ అభిమానులు

ప్ర‌జా క‌వి, గాయ‌కుడు, విప్ల‌వ పోరాట యోధుడు యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ మృతితో ఆయ‌న అభిమానులు క‌న్నీరుపెడుతున్నారు. త‌న పాట‌ల‌తో ఎంతోమందిని ఉత్తేజ‌ప‌రిచార‌ని, ఆట‌పాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేశార‌ని గుర్తు చేసుకుంటున్నారు. బ‌డుబ‌గు బ‌ల‌హీన వ‌ర్గాల గొంతుక‌గా గ‌ద్ద‌ర్ నిలిచార‌ని, ఆయ‌న లేని లోటు పేద‌ల‌కు తీవ్ర న‌ష్ట‌దాయ‌క‌మ‌ని చెబుతున్నారు. అంతేకాకుండా ఆయ‌న‌ను అభిమానించే వారు పాట‌ల‌తో విప్ల‌వాభివంద‌నాలు చెబుతున్నారు. ఇట్లా పాట‌లు రాసి గ‌ద్ద‌ర్‌కు అంకిత‌మిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గ‌ద్ద‌ర్‌తో త‌మ అనుబంధాన్ని యాది చేసుకుంటున్నారు.

‌‌– వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

వీరుడా..
విప్లవ శూరుడా
దళిత పులి
ఎర్రెర్రని దండాలు
నీ పాదా పాదాన
పరి పరి దండాలు
అమ్మాలంత
అయ్యాలంత
అన్నలంతా
అక్కలంత..
నీవు కురిపించిన
అశ్రు వృష్టిలో
కన్నీరు మున్నీరు
మా పాదం మీద
పుట్టు మచ్చ ఎక్కడ?
చెల్లెమ్మలు గగ్గోలు
భద్రం కొడుకో
అన్నావు
మమ్మల్ని వీడిపోయావా?
రక్తంతో రివ్వున సాగే
రిక్షాన్నా నీరు గారే
నీకు నాకు తేడా లేదని
పోలీసన్న గుండెల్లో
నిలిచిన గద్దరన్న
లాల్ సలాం లాల్ సలాం
తెలుగు నేలపై
తెలుగు వల్లభుడిలా
విహరించావు
విప్లవ జ్యోతితో
ఎందరో పోరాట
యోధుల బాటలో
కంచె తరిగావు
అంతేనా…
శవాలతో మాట్లాడి
నిజాలు కక్కించి
జనం కళ్ళు తెరిపించి
నీవు కన్ను మూస్తావా
విప్లవ ధీరుడా?
నీవు పోలేదు
ఇక్కడే… అక్రమార్కుల
గుండెల్లో నవ్వుతూ
నిద్దరోతున్నావు
మేము బానిసలం కాదు
బాంచన్ దొర అనం
నీ స్ఫూర్తి తో
గర్జిస్తాం
అదిరేది లే
బెదిరేది లే
ఎక్కడా తగ్గేది లే

  • బాబు బహదూర్ బిరుదుగడ్డ, సీనియర్ జర్నలిస్ట్ (గద్దర్ ఏకలవ్య శిష్యుడు)
Advertisement

తాజా వార్తలు

Advertisement