అమరావతి, ఆంధ్రపప్రభ: రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా వై లక్ష్మణరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జుడీషియల్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆ బాధ్యతలు నిర్వహించిన ఏవీ రవీంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ స్థానంలో లక్ష్మణరావును నియమించారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన మరో ఇద్దరు రిజిస్ట్రార్లు బీవీఎన్‌ఎల్ చక్రవర్తి (ఐటీ), దుప్పల వెంకట రమణ (అడ్మిన్)ల స్థానంలో రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం భానుమతి, రిజిస్ట్రార్ (నియామకాలు) ఆలపాటి గిరిధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు రేపు (గురువారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. న్యాయమూర్తులుగా ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాంసుందర్, వూటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లా ప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకట రమణలచే ఉదయం 10.30 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఇతర సీనియర్ న్యాయమూర్తులతో కలిసి కొత్త జడ్జిలు కేసులను విచారిస్తారు. అందుకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రీ రోస్టర్‌లో మార్పులు చేశారు.
సీజేకు మాతృవియోగం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలిగింది. జస్టిస్ మిశ్రా తల్లి నళినీ మిశ్రా (82) చత్తీస్‌గడ్ రాష్ట్రం రాయగడ్‌లో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు సీజేను ఫోన్‌లో పరామర్శించారు. సాధారణంగా కొత్త జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించాల్సిఉంది. అయితే సీజే జస్టిస్ మిశ్రాకు మాతృవియోగంతో గవర్నర్ కొత్త జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాల సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.