భూతాపం పెరుగుతూండటంతో మానవ మనుగడ సవాలుగా మారుతోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే విపరిణామాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. అపరిమిత ఉష్ణోగ్రతలు, వాతావరణంలో అస్థిర మార్పులవల్ల నదులతో పాటు మంచినీటి సరస్సులు కూడా ఎండిపోతున్నాయి. వాటి విస్తీర్ణంలో నీటినిల్వలు కుచించుకుపోతున్నాయి. ప్రపంచంలోని సగానికన్నా ఎక్కువగా, దాదాపు 53 శాతం సహజంగా ఏర్పడిన మంచినీటి సరస్సుల విస్తీర్ణం తగ్గిపోగా 40 శాతం సరస్సులు వేగంగా, పూర్తిగా ఎండిపోయాయి. ప్రత్యేకించి ఐరోపాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయని ప్రఖ్యాత జర్నల్ సైన్స్‌లో తాజా అధ్యయన ఫలితాలు ప్రచురితమైనాయి. 1990 నుంచి ఆయా సరస్సులు, రిజర్వాయర్ల తీరును పరిశీలిస్తే ఈ విషయాలు వెల్లడైనాయి. వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడి మానవ మనుగడ దుర్భరమవుతోందని తేలింది. ఆయా సహజసిద్ధ సరస్సుల పరీవాహక ప్రాంతాల్లో జీవిస్తున్న దాదాపు 200 కోట్ల మందిపై దీని దుష్పరిణామాలు పడుతున్నాయని ఆ ఆధ్యయనం తేల్చింది.
ప్రపంచంలో అత్యంత ప్రధానమైన మంచినీటి వనరుగా ( ఐరోపా- ఆసియా – సౌత్ అమెరికా) చెప్పుకునే టిటికక సరస్సులో జలవనరులు అతివేగంగా తగ్గిపోతున్నాయి. ఈ సరస్సులో గడచిన మూడు దశాబ్దాల్లో ఏడాదికి 22 గిగాటన్నుల మేర నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోతున్న నీటి పరిమాణం… అమెరికాలోని అతిపెద్ద రిజర్వాయర్ లేక్ మీడ్కన్నా 17 రెట్ల ఎక్కువ. అంటే ఏ స్థాయిలో టిటికక సరస్సు చిక్కిపోతోందో అర్థం చేసుకోవచ్చు. మంచినీటి సరస్సులు విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు. వ్యవసాయం, జలవిద్యుత్, ప్రజలు నేరుగా నీటిని వాడుకునే సౌకర్యం వీటివల్ల కలుగుతాయి. నిజానికి సరస్సులను వాతారవణ మార్పులకు కాపలాదారుగా అభివర్ణిస్తారు.
అయితే వర్షపాతం తగ్గిపోవడం, అవక్షేపణం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వంటి కారణాలతో సహజమైన మంచినీటి సరస్సులు కుచించుకుపోతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 2వేల సరస్సులకు చెందిన కొలతలను ఉపగ్రహాల సాయంతో వాతావరణ, హైడ్రోలాజికల్ విధానాల్లో ఈ విషయాన్ని నిర్థారించారు. 1992-2020 మధ్య 53 శాతం మంచినీటి సరస్సుల్లో నీటిమట్టాలు స్థిరంగా తగ్గిపోతూ వస్తున్నట్లు తేల్చారు. విచ్చలవిడిగా వాడటం, వాటి గమనాన్ని, ప్రవాహాన్ని మార్చడం వంటివి కూడా ఇందుకు కారణమని గుర్తించారు. ప్రత్యేకించి మధ్య ఆసియాలోని అరల్ సముద్రం, మధ్యప్రాచ్యంలోని డెడ్ సీ, అఫ్గనిస్తాన్, ఈజిప్ట్, మంగోలియా వంటి ప్రాంతాల్లోని అనేక సరస్సులు ఎండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల సరస్సుల్లో నీరు ఆవిరైపోయి.. చిక్కిపోతున్నాయి.