2001 సెప్టెంబర్‌లో ట్విన్‌టవర్స్‌పై ఉగ్రదాడితో అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్, ఆ తర్వాత కూడా వరుస దాడులకు కుట్రలు పన్నినట్లు తాజాగా వెల్లడైంది. అప్పట్లో విమానాలను హైజాక్‌చేసి 9/11 దాడులతో మారణహోమాన్ని సృష్టించిన లాడెన్, 3వేల మంది మరణానికి కారణమయ్యాడు. అంతటితో ఆగకుండా మరోసారి భీకర దాడికి ప్రణాళిక సిద్ధంచేశాడు. ప్రైవేటు జెట్లను ఉపయోగించడంతో పాటు రైలు పట్టాలను తొలగించి వందల మందిని చంపేయాలని పథకం రచించినట్లు తెలిసింది. 2011లో అబోట్టాబాద్‌లో లాడెన్ హత్య అనంతరం లభించిన కీలక పత్రాలను యూఎస్ నేవీ సీల్ భద్రపరిచింది. ఆ పత్రాల్లో కొన్ని సంచలన విషయాలు బయటపడినట్లు సీబీఎస్ న్యూస్ తమ కథనంలో వెల్లడించింది. 11 ఏళ్ల క్రతం లాడెన్‌పై ఆపరేషన్ చేపట్టిన అమెరికా నేవీ సీల్ బృందం తీసుకొచ్చిన వందలాది పత్రాలను ఇస్లామిక్ స్కాలర్ నెల్లి లాహౌద్ అధ్యయనం చేశారు. అందులో లాడెన్ తమ సభ్యులకు రాసిన వ్యక్తిగత లేఖలు కూడా ఉన్నాయి.
లాడెన్ అంచనా తప్పింది..
”9/11 దాడి తర్వాత అమెరికన్ల స్పందన చూసి లాడెన్ ఆశ్చర్యపడినట్లు ఆ లేఖల ద్వారా తెలిసింది. దాడుల అనంతరం అమెరికన్ ప్రజలు వీధులపైకి చేరి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతారని అతడు భావించాడు. కానీ, లాడెన్ అంచనా తప్పింది. ఇక, దాడుల తర్వాత మూడేళ్ల పాటు లాడెన్ పరారీలో ఉన్నాడు. ఆ సమయంలో అల్‌ఖైదా సభ్యులతోనూ అతడు టచ్‌లో లేడు. 2004లో మళ్లీ తన ఉగ్ర ముఠాకు చేరువైన లాడెన్.. అమెరికాపై మరో దాడికి కుట్రలు పన్నాడు. అయితే 9/11 దాడి తర్వాత ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచడంతో మళ్లీ అలాంటి దాడులు కష్టమని భావించాడు. అందుకే ఈసారి ఛార్టర్ విమానాలను ఉపయోగించాలని అల్‌ఖైదా అంతర్జాతీయ యూనిట్‌కు సూచించాడు. అదీ కుదరకపోతే అమెరికా రైల్వేలను లక్ష్యంగా చేసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు” అని లాహౌద్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..