Tuesday, November 26, 2024

Big Story: సర్కారు వైద్యాలయాల్లో వసతులు కరువు.. పూర్తికాని కొత్త మెడికల్‌ కాలేజీల భవన నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ బోధనా వైద్య కళాశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. పలు సర్కారు వైద్యాలయాల్లో డాక్టర్లు ఉంటే… వైద్య యంత్రాలు, సరైన భవనాలు లేవని, సరైన భవనం ఉన్న చోట వైద్య యంత్రాలు అందుబాటులో ఉండవని, వైద్య యంత్రాలు, భవనం ఉన్నచోట వైద్యులు సరిపడినంత మంది వైద్యులు, సిబ్బంది ఉండ ని పరిస్థితులు నెలకొన్నాయి. సరిపడినన్ని మందులు, సరైన ఆసుపత్రి భవనం, అన్ని వసతులతో కూడిన ఆపరేషన్‌ థియేటర్‌, తగినన్ని వైద్య ఉపకరణాలు లేవని ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ బోధనా వైద్యులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాల లేమి నడుమ రోగులకు మెరుగైన వైద్యం ఎలా అందించడం ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

పలు ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, చివరకు ఎక్స్‌రే యంత్రాలు కూడా కండిషన్‌ లో లేవన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆపదలో సర్కారు వైద్యాలయాలకు వచ్చే రోగులకు చికిత్స అందించడంలో అసలైన ఇబ్బందులు సదుపాయాలు కొరవడడం కారణంగానే ఎదురవుతున్నాయని వైద్యులు వాపోతున్నారు. క్రిటికల్‌ కేర్‌ వైద్యం, టెస్టుల తాలూకూ సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తదితర యంత్రాలు తరచూ మొరాయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు సరైన భవనాలు కూడా అందుబాటులో లేవు.
ఈ ఏడాది 2022-23 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభంకానున్న మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లా మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికీ సరైన సదుపాయాలు అందుబాటులో లేవని ప్రభుత్వ బోధనా వైద్యులు ఆరోపిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన మెడికల్‌ కాలేజీల భవన నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్ణంగా ఉన్నాయని, ఇప్పటి వరకు ల్యాబ్‌, క్లాస్‌ రూం తదితర సదుపాయాల కల్పన ఇప్పటికీ పూర్తికాలేదని ప్రభుత్వ వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కొత్తగా అనుమతి పొందిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. హైదరాబాద్‌లోని ప్రముఖ చిన్న పిల్లల ఆసుపత్రి నీలోఫర్‌ లోనూ ఏళ్లుగా భవన నిర్మాణ ఎక్స్‌ టెన్షన్‌ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రామగుండం మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా కేటాయించిన ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకలకు బదులు కేవలం 120 పడకలు, వాటికి మాత్రమే సరిపడా సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆరు ఆపరేటింగ్‌ రూంలకు బదులు రెండు మాత్రమే ఉండగా, సూపరిండెంట్‌, ప్రిన్సిపాళ్లకు ఒకే గది అందుబాటులో ఉండడం గమనార్హం. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాల కొరతతోపాటు శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు సరైన ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులో లేకుండా పోయింది.

సమస్యలున్న ఆసుపత్రుల్లో ఇవి కొన్ని మాత్రమేనని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని ప్రభుత్వ బోధనా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్య చికిత్సలో ప్రాథమికంగా అవసరమయ్యే నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా తగినంత పరిమాణంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా కావడం లేదని వైద్యుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమస్యలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement