- బయట గొప్ప, లోపల డబ్బా అన్న చందాగా అమీర్ పేట్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి
- జనరేటర్ ఉన్నప్పటికీ కరెంట్ కోతతో మెషీన్లు మొరాయించడంతో క్యూ లైన్లలో వేచి ఉంటున్న పేషేంట్స్
- అరకొర వసతులతో కొనసాగుతున్న అమీర్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి
- డాక్టర్ ల కొరత, మందుల కొరత, వసతుల కొరతతో వెనుతిరుగుతున్న పేషేంట్స్
- వసతుల కొరతపై ఉన్నత వైద్య అధికారులకు ఎన్ని మార్లు సిఫారస్ చేసినా పట్టించుకోవడం లేదు : ఆసుపత్రి వర్గాలు
- ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడంలో విఫలమవుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు
అమీర్ పేట్ : అమీర్ పేట్ ప్రాంత ప్రజలతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల పేద ప్రజల వైద్య కష్టాలను తీర్చేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమీర్ పేట్ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి బయట నుండి చూడడానికి ఎంతో హుందాగా కనిపించినప్పటకి, చికిత్స కోసం లోపలికి వెళ్తున్న పేషేంట్స్ మాత్రం వసతుల కొరతతో వెను తిరుగుతూ నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది.
నిలోఫర్ ఆసుపత్రికి తరలి పోతున్న గర్భిణీల స్త్రీలు…
అమీర్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం వచ్చే గర్భిణీ స్త్రీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో అందుకు సరిపడా గైనకాలజిస్ట్ డాక్టర్ లు అందుబాటులో లేకపోవడంతో కొందరు వరుస లీవ్ లో లేదా డిప్యుటేషన్ మీద వెళ్లగా మిగిలిన ఒకరో, ఇద్దరు డాక్టర్ లు గర్భిణీ స్త్రీలకు ఓపీ, స్కానింగ్, ఆపరేషన్స్, ల్యాబ్ టెస్ట్ లు, తదితర వైద్యం సకాలంలో అందించలేకపోవడంతో గంటలకు గంటలు క్యూ లైన్లలో వేచిచూసి చూసి ఓపిక లేక నిలోఫర్, గాంధీ ఆసుపత్రులకు తరలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తీరా నిలోఫర్ ఆసుపత్రి వెళ్లిన గర్భిణీ స్త్రీలకు అమీర్ పేట్ లో ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా మా వద్దకు ఎందుకు వచ్చారు అంటూ చివాట్లు తింటూ నిలోఫర్ ఆసుపత్రి డాక్టర్ లతో చికిత్స చేయించుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి గర్భిణీ స్త్రీలది.
ఉన్నత అధికారులకు సిఫారసు చేసాం కానీ పట్టించుకోవడం లేదు : ఆసుపత్రి వర్గాలు
అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిలో నెలకొన్న డాక్టర్ ల కొరత, సిబ్బంది కొరత, వసతుల కొరత, మందుల కొరతలతో పాటు ఇతరాత్ర సమస్యలపై ఉన్నత అధికారులకు పలు మార్లు లెటర్ లు రాసినప్పటికీ వారి నుండి పెద్దగా స్పందన లేకపోవడమే కాకుండా ఉన్న స్టాఫ్ ను కూడా డిప్యూటేషన్ మీద వేర్ చోటికి తరలిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ ఆసుపత్రిని ఆసరా చేసుకొని నిత్యం ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గ డాక్టర్ లు, సిబ్బంది, వసతులు, మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో మేము నిస్సహాయ పరిస్థితిలో ఉండి చూడడమే తప్ప చేసేది ఏమి లేదని వారి ఆవేధను వ్యక్త పరుస్తున్నారు.