హైదరాబాద్, ఆంధ్రప్రభ: మట్టిలో మాణిక్యం… అధికారుల్లో ఆణిముత్యం… పాలనలో పారదర్శకం… విధినిర్వహణలో అంకితభావం… పేదల పట్ల ఉదారత్వం… వెరసి బలరామ్ …సింగరేణి ఇన్‌చార్జి సీఎండీ! ప్రతి రోజు 18 గంటల పాటు కార్మికుల శ్రేయస్సుకోసం తపించిపోయే బలరామ్ కోటి రూపాయల బీమా కల్పనతో ఒక్కసారిగా బయట ప్రపంచానికి ఐకాన్‌గా మారిపోయారు. బొగ్గు బావుల్లో జీవితాలను ధారపోస్తున్న శ్రమజీవులకు ఎంత చేసినా తక్కువేనన్న గట్టి నమ్మకంతో ఉండే బలరామ్, వారి కుటుంబాలకు కనీస భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కోటి బీమా పథకాన్ని రచించారు.
ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ప్రోద్బలంతో ఆయన సింగరేణి కార్మికులకు ఈ అపూర్వ భద్రతా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉంది.ఎదగాలన్న దృఢ సంకల్పం ఉంటే ఎన్ని కష్టనష్టాలు, ఆటుపోట్లు ఎదరైనా అనుకున్నది సాధించవచ్చనడానికి నిలువుటద్దం బలరామ్. చిన్ననాటి నుంచి ఆయన జీవితం ముళ్లబాటలోనే నడిచింది. అయితే, ఆయన మనోబలం ముందు అవన్నీ తలవంచాయి… జీవిత పాఠాలు నేర్పి పురోగతికి సహకరించాయి! కష్టాలనే జీవిత పురోగతికి మెట్లుగా మలుచుకున్న బలరామ్ పాలమూరు జిల్లా తిరుమలగిరికి చెందిన హూన్య, కేస్లీ దంపతుల ఏడుగురు సంతానంలో జ్యేష్టుడు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆయన ఏనాడూ పరిస్థితులకు వెరవలేదు… పైగా ఎదురొడ్డి నిలిచి గెలిచాడు.
తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచేందుకు కూలి పని చేశారు. మరోపక్క చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పదవ తరగతి వరకూ రోజుకూలీగా పనిచేస్తూనే చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వలస వచ్చారు. కుటుంబ ఆచారం ప్రకారం చిన్నతనంలోనే వివాహం కావడంతో ఉన్నత చదువు భారమైంది… కాని ఆపలేదు. ఆటో డ్రయివర్‌గా, గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే ఉన్నత చదువులను కొనసాగించారు. చవరకు 2010లో సివిల్స్‌లో రెవెన్యూ సర్వీసెస్‌కు ఎన్నికై ఎందరికో ఆదర్శంగా నిలిచారు.మొదటి పోస్టింగ్ ముంబయిలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై సింగరేణికి వచ్చారు. ఫైనాన్స్, పర్సనల్ సంచాలకులుగా పనిచేసి సిబ్బంది, కార్మికుల్లో స్ఫూర్తినింపారు…
ఆయన అకుంఠితదీక్షను గుర్తించిన ప్రభుత్వం సీఎండీగా నియమించింది. నిరంతరం సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రోజుకు 18 గంటలు పనిచేస్తూ కార్మికుల పక్షపాతిగా పేరుపొందారు. నిత్యం కార్మికులకు అండదండలు అందిస్తూ, సిబ్బందిని ప్రోత్సహిస్తూ విధులను నిర్వహిస్తున్న బలరామ్ హరిత ప్రేమికుడు. శ్రీరాంపూర్‌లోని ఉపరితల గని మట్టి కుప్పపై కేవలం ఒకే ఒక గంటలో 1237 మొక్కలను స్వయంగా నాటి రికార్డు సృష్టించిన ఘనత ఆయనది. ఇలా ఇప్పటికే వేలాది మొక్కలను స్వయంగా నాటి ఆయన సింగరేణి కార్మికులు, సిబ్బందిలో చైతన్యం కలిగించారు. అందరిలోనూ పర్యవరణ స్పృహ కలిగించి ఆయన అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచారు. పేదరికం పిల్లల ఎదుగుదలకు అడ్డంకి కారాదన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. తనవలె ఎవరూ ఇబ్బందులు పడకూడదన్న సంకల్పంతో ప్రతి ఏటా పేదపిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందజేస్తున్నారు.
అలాగే, ఆర్ధిక ఇబ్బందుల వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నామని బాధపడుతున్న విద్యార్ధులకు ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఆయన ఆప్తమిత్రుడు… మనోధైర్యం నింపుతూ పెద్దన్నగా నిలుస్తున్నారు.నిత్యం కార్మికులకు అండగా నిలవడమే కాకుండా, సింగరేణిలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఆలోచిస్తుంటారు. సింగరేణి విస్తరణకు ఆయన ఎన్నో ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బలరామ్, సింగరేణిని మరింత అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా తెలంగాణ పురోగతికి దోహదపడతారని సామాజిక నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు