భారత ప్రధాని ప్రస్తుతం కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-బాజెర్ అల్-సబా ఈ అవార్డును అందజేశారు.
కాగా, వివిధ దేశాల నుంచి ప్రధాని మోదీ అందుకున్న 20వ అంతర్జాతీయ అవార్డు ఇది. ఇక కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆదివారం ఆ దేశ ఎమిర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతోపాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకస్థాయికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
అనంతరం క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబాతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు నిర్వహించారు. అంతకుముందు బయాన్ ప్యాలెస్‌లో గౌరవ వందనం స్వీకరించారు.