Friday, November 22, 2024

గోవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

సున్నితమైన అంశంలో వైసీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌ రెడ్డి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన్ను మీడియా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆయ‌న ఉన్న‌ట్టుండి గోవ‌ధ నిషేధం అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆయన వ్యాఖ్యలపై మండిపడుతోంది.

ఇటీవల బ‌క్రీద్ సంద‌ర్బంగా గోవ‌ధ అంశంపై స్థానిక బీజేపీ నేత‌ల‌కు, ముస్లిం సంఘాల‌కు మ‌ధ్య వివాధం చెల‌రేగింది. దీంతో ఆగ్ర‌హించిన ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డి మీడియాను పిలిచి మ‌రీ గోవ‌ధ అంశంపై మాట్లాడారు. దేశంలో గోవ‌ధ నిషేధం ఎత్తివేయాల‌ని, గోవులను తింటే తప్పేంటని ప్రశ్నించినట్లు ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఎప్పుడు వివాదాల‌కు దూరంగా ఉండే ఎమ్యెల్యే ఒక్క‌సారిగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడంతో హిందుత్వ సంఘాలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా షాక్‌కు గురయ్యారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలలో బీజేపీ నేతలు ధర్నాలు చేపట్టారు. గోవులను కోసుకుని తినాలంటూ, గో రక్షణ చట్టాన్ని రద్దు చేయాలంటూ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా సీఎం జగన్ మద్దతుతో వైసీపీ ఎమ్మెల్యేలు బరితెగించి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గుండ్రపల్లి భరత్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. మరోవైపు గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ కార్యదర్శి పాతురి నాగభూషణం, పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement