సీఎం జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలు ప్రదర్శించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియో ఫోర్జరీదని, దానిని మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ వైసీపీ లీగల్ సెల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఉమపై కేసు నమోదు చేసినట్టు సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్ కుమార్ తెలిపారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న తిరుపతిలో ప్రచారం నిర్వహించిన దేవినేని ఉమ ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. అందులో తిరుపతి రావడానికి ఎవరు ఇష్టపడతారని జగన్ వ్యాఖ్యానించినట్టుగా ఉంది. ఈ వీడియో ఫోర్జరీ చేసినదని, ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను పక్కదారి పట్టించాలన్న దురుద్దేశంతోనే మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రదర్శించారని ఆరోపిస్తూ వైసీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమపై సీబీఐ కేసు నమోదు చేసింది.