ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలో సాధువులు, భక్తులు హాజరవుతున్నారు. దీంతో మరింత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతాయన్న భయం పట్టుకుంది అధికారులకు. అయితే కుంభమేళా ఈవెంట్‌ను.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన మర్కజ్‌తో పోల్చవద్దు అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ అన్నారు. కుంభ్, మర్కజ్‌లకు పోలికే వద్దు అని, మర్కజ్ ఈవెంట్ నిర్బంధ స్థలంలో జరిగిందని, కానీ కుంభమేళా చాలా ఓపెన్ ఏరియాలో జరుగుతోందన్నారు. రెండు మతపరమైన కార్యక్రమాలను పోల్చవద్దు అన్నారు.
సెకండ్ వేవ్ పెరగడానికి కుంభమేళా కారణమన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. కుంభమేళాకు వస్తున్న వారంతా స్వదేశీయులే అన్నారు. మర్కజ్ ఘటన జరిగిన సమయంలో కరోనా గురించి అవగాహన లేదని, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు రూముల్లోనే ఎంత కాలం నుంచి ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. ప్రస్తుత దశలో కోవిడ్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన వచ్చిందన్నారు. మార్గదర్శకాలను ప్రజలు పాటిస్తున్నారన్నారు. హరిద్వార్‌లో బుధవారం కూడా భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు పుణ్య స్నానాలు చేశారు.