Wednesday, November 20, 2024

కోల్‌కతా జట్టులో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది: కుల్‌దీప్

భారత జట్టులో చైనామన్ బౌలర్ కుల్‌దీప్‌కు స్థానం కరువైంది. మరోవైపు ఐపీఎల్‌లో అతడు ఆడుతున్న కోల్‌కతా టీమ్ కూడా పట్టించుకోవడం లేదు. ఆ జట్టు కుల్‌దీప్‌ను తుదిజట్టులో ఆడించడం లేదు. దీనిపై కుల్‌దీప్ స్పందించాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ వీడియో ఇంటర్వ్యూలో అతడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభపై జట్టు యాజమాన్యానికి నమ్మకం లేదేమోనంటూ కుల్‌దీప్ ఆవేదన చెందాడు. జట్టుకు భారత కెప్టెన్ లేకపోవడమూ టీమ్‌లో కమ్యూనికేషన్ గ్యాప్‌కు కారణమైందన్నాడు. ఇప్పుడున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలియదుగానీ.. భారత కెప్టెన్ ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా తాను మాట్లాడేవాడినని చెప్పాడు.

ఒకవేళ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండి ఉంటే అతడిని అడిగివాడినని… ఎవరైనా అతడి దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ ఉందన్నాడు. జట్టులో పాత్రేంటి? ఎక్కడ మెరుగవ్వాలి? వంటి విషయాలను రోహిత్‌ను నిస్సందేహంగా అడిగి తెలుసుకోవచ్చని కుల్‌దీప్ చెప్పాడు. కోల్‌కతా జట్టులో చెప్పాపెట్టకుండా తుది జట్టు నుంచి తీసేస్తారని ఆరోపించాడు. దీనిపై ఓ సారి జట్టు యాజమాన్యాన్ని సంప్రదించినా వారి నుంచి ఎలాంటి స్పందనగానీ, వివరణ గానీ రాలేదన్నాడు. జట్టులో చాలా మంది స్పిన్నర్లు, బౌలర్లున్నప్పుడే ఇలా జరుగుతుందని, టీమ్ కు తనపై నమ్మకం లేదేమోనని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement