Thursday, November 21, 2024

KTR | బాథితుల‌తో ఢిల్లీ వెళ్తా.. రేవంత్ చ‌ర్య‌ల‌ను ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ముందు పెడ్తా

హైద‌రాబాద్ : లగచర్ల గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు తాను ఊరుకోనని.. బాధితులను ఢిల్లీ తీసుకుపోయి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి అర్ధిస్తామ‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్ నేడు మ‌రోసారి జ‌న‌తా గ్యారేజ్ గా మారింది. ల‌గ‌చ‌ర్ల బాధిత‌ మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చి కేటీఆర్ స‌మావేశ‌మై వారి బాధ‌ల‌ను చెప్పుకున్నారు..

- Advertisement -

నిన్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చి సంతకాలు చేసి మా భూములను ఫార్మా కంపెనీకి ఇవ్వాలని చెప్పారు. మా ఆయనను పోలీసులు కొట్టారు.. నేను గర్భవతిని అంటూ కేటీఆర్‌తో ఓ బాధితురాలు త‌న గోడును క‌న్నీళ్ల‌తో వెళ్ల‌బోసుకుంది..
మా భూమి, ఇండ్లు పోతదని మేము కొట్లాడుతున్నాము కాని మా ఇంట్లోకి రాత్రి పూట దూరి మమ్మల్ని ఇలా కొడతారని మేము అనుకోలేదు మేము భయానికి అడివిలో పడుకుంటున్నాము అంటూ మ‌రో మ‌హిళ గోల్లు మంది.

మా పెద్ద కొడుకుకి ఊరికి శిక్ష వేస్తామని చెప్తున్నారు అంటూ కేటీఆర్ వద్ద కంటతడి పెట్టుకుంది ఈ గ్రామ‌స్తురాలు.. మా భూములు ప్రాణాలు పోయినా ఇచ్చేది లేద‌ని, ఈ నేల త‌మ‌కు త‌ర‌త‌రాలుగా త‌మ కుటుంబాల‌కు తిండిపెడుతున్న‌ద‌ని బ‌తుకు ఇస్తున్న‌ద‌ని తేల్చి చేప్పారు.

ఈ సంద‌ర్భంగా బాధితుల‌కు తామ అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. కేసీఆర్ త‌ర‌పున మాట ఇస్తున్నాం. మీ మ‌నువండ్లు, పిల్ల‌లు, భ‌ర్త‌లు ఇంటికి తిరిగి వ‌చ్చే దాకా మేం చూసుకుంటాం. అండ‌గా నిల‌బ‌డుతాం. ఆందోళ‌న చెంద‌కండి.. కోర్టుకు పోయి కొట్లాడుతాం. అర్థం ప‌ర్థం లేకుండా భూమి గుంజుకుంటాం అంటే ఊరుకోమ‌ని మ‌హిళ‌లు చెబుతున్నారు. జానెడు భూమి కోసం త‌ల‌లు ప‌గుల‌గొట్టుకుంటాం.. కొట్లాడుతాం. మా ప్రాణం పోయినా భూమి ఇవ్వం అని మ‌హిళ‌లు చెబుతున్నార‌ని కేటీఆర్ తెలిపారు.

లగ‌చ‌ర్ల‌ తండాల మ‌హిళ‌లు మాట‌లు విన్నాను. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, అడ్డ‌గోలుగా మాట్లాడుతున్న మంత్రుల‌ను ఒక్క‌టే అడుగుతున్నా. మేం రెచ్చ‌గొడితే, మేం పైస‌లు ఇస్తే కొట్లాడ‌మంటే కొట్లాడేవారిలాగా వీళ్లు క‌న‌బడుతున్నారా..? బాధిత మ‌హిళ‌లు ఇంత స్ప‌ష్టంగా, డైరెక్ట్‌గా చెబుతున్నారు. భూములు తీసుకుంటామ‌ని నోటీసులు ఇవ్వ‌లేదు. చెప్ప‌లేదు. ఫార్మా కంపెనీ వ‌ల్ల లాభం ఏంటో చెప్ప‌లేదు. 9 నెల‌ల నుంచి ఆందోళ‌న చేస్తుంటే ఏ ఒక్క‌రు కూడా ప‌ట్టించుకోలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రుస‌టి నెల నుంచి పంచాయితీ జ‌రుగుతుంద‌ని బాధిత మ‌హిళ‌లు తెలుపుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇంత మంది ఆవేద‌న‌ను రాజ‌కీయ కుట్ర‌గా చిత్రీక‌రించి, భూములు గుంజుకునే కుట్ర చేస్తోంది ప్ర‌భుత్వం. క‌చ్చితంగా న్యాయ పోరాటం చేసి అడ్డుకుంటాం. పూర్తి స్థాయిలో అండ‌గా ఉంటాం. న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేస్తాం. ల‌గ‌చ‌ర్ల‌లో అరెస్టు అయిన వారికి చిత్ర‌హింస‌లు పెడుతున్నారు. న‌డ‌వ‌లేని, మాట్లాడ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. జాతీయ‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కోరుతున్నాను.

ఈ ఘ‌ట‌న‌ను సుమోటోగా తీసుకుని వెంట‌నే విచార‌ణ చేయండి. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయాల‌ని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ‌ను కోరుతున్నాను. పౌర‌, గిరిజ‌న, మ‌హిళ సంఘాలు కూడా ఈ దురాగ‌తాల‌పై, కిత‌రాక చ‌ర్య‌ల‌పై స్పందించాలి. రాజ‌కీయ రంగు పులిమి ఇంత మంది గొంతు కోసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. భూములు లాక్కొనే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. దుర్మార్గ‌పు ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌ను అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. తాను ఏం తప్పు చేయలేదని.. అందుకే నేను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదు. మోడీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను. చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా…ఏం పీక్కుంటావో పీక్కో. మళ్లీ సవాల్ చేస్తున్న.. ఈ రేస్ అయిన ఇంకేదైనా కేసులోనైనా అరెస్ట్ చేస్తే చేసుకోండన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే ధైర్యం నాకు ఉందని.. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశామన్నారు.

అరెస్ట్ అయి జైలు నుంచి విడుద‌ల‌య్యాకా రెట్టించిన ఉత్సాహంతో మీ అక్ర‌మాల‌పై పోరాడాతాన‌ని తెల్చి చెప్పారు.. రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్‎లో ఇంకా ఎన్ని రోజులు ఉంటావో తెలియదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో అని ఎద్దేవా చేశారు. ఉత్తమ్, భట్టి నీ కుర్చిలో కూర్చుంటారని.. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీ లోనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ కోసం రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమి లేదని.. కేవలం డబ్బు దండుకోవడం కోసమే మూసీ టాపిక్ ఎత్తుకున్నారని ఆరోపించారు. డీపీఆర్ లేకుండానే రూ. లక్ష 50 వేల కోట్ల అయితవని ఎలా చెప్పారని నిలదీశారు. మూసీ పేరుతో ఢిల్లీకి డబ్బులు పంపేందుకు ప్లాన్ చేశారని విమర్శలు గుప్పించారు.

లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఒక బోగస్ అని కోర్టు చెప్పిందని కేటీఆర్ అన్నారు. పోలీసులు కిరాతంగా వ్యవహరిస్తు్న్నారని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేట్ సైన్యం లాగ పరిస్థితి తయారైందని మండిపడ్డారు. రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు చేస్తు్న్నారని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని, ఇప్పుడు ఎపిలో క‌ష్టాలు ప‌డుతున్న అధికారులలాగానే మ‌రిన్ని క‌ష్టాలు ప‌డాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement