వసీం మరణానికి కారణమెవరు?సకాలంలో జీతం రాకపోవడంతోనే సూసైడ్
నోట్ రాసి మరీ చనిపోయిన ఉద్యోగి
ప్రభుత్వం తీరుపై ఘాటు విమర్శలు చేసిన కేటీర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వసీం బలవన్మరణానికి కారణమెవరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. అది పచ్చి అబద్ధమని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి వసీం ఆత్మహత్యే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సూసైడ్ నోట్ రాసి..
వసీం తన భార్య రజనికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘డియర్ రజని.. ముందు నువ్వు నన్ను క్షమించు. నిన్ను చాలా బాధపెట్టాను. పిల్లలు జాగ్రత్త. మనకు ఎవ్వరూ లేరు. కానీ, మన పిల్లలు అలా కాకూడదు. నేను చాలా ఊహించుకున్నాను. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మ అని ఉంటే నా పిల్లల్లో ఎవరికైనా కొడుకుగా పుడతా. ఇంకొక్కటి రజనీ నీకు వీలైతే వీళ్లకు డబ్బులివ్వు. ఎక్కువేం చేయలే’.. అంటూ తాను ఎవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాని ఆ లేఖలో వెల్లడించారు.