Tuesday, November 19, 2024

రెండు ద‌శాబ్దాల క‌ల‌ను మూడు నెల‌లో నెర‌వేరుస్తాం – కెటిఆర్

హైద‌రాబాద్ – హైదరాబాద్ వీఎస్టీ-ఇందిరా పార్క్ వద్ద నిర్మిస్తున్న‌ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిర్మిస్తున్న స్టీల్​ బ్రిడ్జి పనుల పురోగతిని జీహెచ్​ఎంసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


అనంతరం స్టీల్​బ్రిడ్జి నిర్మాణంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ స్టీల్​బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్​ మళ్లింపులు వంటి అంశాల విషయంలో నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్​బ్రిడ్జి కోసం జీహెచ్​ఎంసీ దాదాపు రూ.440 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్​ రోడ్డు వద్ద ట్రాఫిక్​ను తగ్గించి.. ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్​పేట్ వంటి నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని చెప్పారు. ఇంతటి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement