న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ప్రవల్లిక ఆత్మహత్యపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేసిన ఆయన ప్రవల్లిక ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడడం వల్లనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, నియామకాల విషయంలో కేసీఆర్ సర్కారు దారుణంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలో రాబోతుందని, అప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడే కేటీఆర్ ప్రవల్లిక ఆత్మహత్యపై ట్విట్టర్లో స్పందించాలని డిమాండ్ చేశారు. తమ పొరపాటుతోనే పరీక్ష నిర్వహించలేకపోయామని ఒప్పుకుంటూ కేటీఆర్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.