రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నా కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల తర్వాత వ్యవసాయ షెడ్ల వద్ద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు చెప్పుకుంటున్నట్టు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మనకు ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అంటున్నట్లు చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారని అన్నారు. 80 మీటర్ల ఎత్తు నుండి సిరిసిల్లకు 350 మీటర్ల ఎత్తు ఉంటుందని, ఇంత ఎత్తుకు నీరందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు సముద్రంలోకి వెళ్లకుండా బ్యారేజీలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో 21 పంపింగ్ స్టేషన్లు, 1770 కిలోమీటర్ల ఫ్లో కెనాల్స్ ద్వారా 618 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకొచ్చామని తెలిపారు. మేడిగడ్డ ఆరు కిలోమీటర్లలో ఒక పాయింట్‌లో 85 పిల్లర్లు ఉన్నాయని, రెండు పిల్లర్ల సమస్య ఉందని.. దానిని బాగు చేయలేక కాంగ్రెస్ పార్టీ అపవాదులు మోపి గత ప్రభుత్వాన్ని బధనము చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్ విజయానికి గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరర్నపల్లి మండలాన్ని ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని, ప్రజలు, రైతులు ఇబ్బందులు కలిగిన సమయంలో వారికీ అండగా నిలిచి పోరాడాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.