Tuesday, November 19, 2024

ఉద్యోగ భ‌ర్తీ లెక్క‌లివిగో…చెక్ చేసుకోండి….కెటిఆర్..

కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర విపక్షాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం

జానారెడ్డి కూడా అబద్దాలు చెప్పడం బాధాకరం

టీఎస్‌పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేశాం

ఎన్నికల కోడ్‌ ముగియగానే… మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తాం

హైదరాబాద్‌, : ఉద్యోగాల కల్పన విషయంలో.. తెలంగాణ ఏర్పడిన నాటినుండీ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్దితో వ్యవహరించిందని, అధికారికంగా ఆయా శాఖలలో ఉన్న గణాంకాలే ఇందుకు నిదర్శనమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నిజాలు జీర్ణించుకోలేక అర్ధసత్యాలు, అసత్యాలతో విపక్షాలు.. తెలంగాణ యువతను గందరగోళ పరుస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు జూటామాటలు మాట్లాడుతున్నారని, జానారెడ్డి లాంటి సీనియర్‌ నేత కూడా అసత్యాలు మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయనిది.. ఆరున్నరేళ్ళలో తాము ఎన్నో రెట్లు ఎక్కువగా చేశామని, ఇంకా చేస్తామని అన్నారు. తెలంగాణ యువత ప్రభుత్వ చిత్తశుద్దిని గుర్తించా లని కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ యువతకు బహిరంగలేఖ రాశారు. లెక్కలు చూసైనా ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు మానుకోవాలన్నారు. 1,32,899 ఉద్యోగాలు ప్రభుత్వరంగంలో కల్పించామని, అనుమానం ఉంటే ఆయా శాఖల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు. టీఎస్‌పిఎస్సీ ద్వారా.. అత్యంత పారదర్శకంగా చరిత్రలో ఎన్నడూ లేనంత నిజాయితీగా ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు…

- Advertisement -

కెటిఆర్ రాసిన లేఖ య‌థాత‌థంగా…

నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుందన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన అర్థసత్యాలు, అసత్యాలతో ప్రజలను ముఖ్యంగా యువతను గందరగోళప రచడానికి ప్రతిపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలు పెట్టాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో నిజాలను దాచి కాంగ్రెస్‌, బీజేపీలు చెపుతున్న జూఠా మాటలు అందులో భాగమే. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ముఖంగా ప్రజల ముందుంచాను. దీంతో పాటు మా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా సాధికారికంగా వివరించాను. ఈ సమాచారం అంతా వివిధ శాఖల నుంచి తీసుకున్నదే. ఈ మేరకు 2014 నుంచి 2020 వరకు 1 లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేశాము. ఉద్యోగాల కల్పనపై మా ప్రభుత్వ నిబద్దతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో మరోసారి ధ్రువీకరించుకో వచ్చని మీడియా ముఖంగా తెలియచేశాను. అయితే ఈ నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి, గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలను నిన్నటి నుంచి చేస్తున్నాయి. జానారెడ్డి లాంటి సీనియర్‌ రాజకీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని టీఆర్‌ఎస్‌ చెప్పినట్టు జానారెడ్డి ఈ రోజు మీడియాతో అన్నారు. అవును ముమ్మాటికి జానారెడ్డి చెప్పింది నిజమే. ఇచ్చినమాట ప్రకారం మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాం. ఇదే విషయాన్ని నేను ప్రజల ముందుంచాను. తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో త్వరలో చెప్తామన్న జానారెడ్డి, అందులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలి. జానారెడ్డి లాంటి సీనియర్‌ నాయకులతో పాటు ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అవా స్తవాలు మాట్లాడుతున్న నేపథ్యంలో వారి దుష్ప్రచారాన్ని ఎండగట్టేలా మా ప్రభుత్వం భర్తీ చేసిన లక్షా32 వేల 899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నాను. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకి మరోసారి స్పష్టత ఇచ్చేందుకు… ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారు అయోమయానికి గురికాకుండా ఉండే ఉద్దేశంతో వివరాలు జతపరుస్తున్నాను. వీటిని మరోసారి చూసైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకుంటాయని ఆశిస్తున్నాను.
ప్రైవేట్‌ రంగంలో 14లక్షల ఉద్యోగాలు
ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే విప్లవాత్మకమైన టీఎస్‌ఐపాస్‌ విధానంతో ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ యువతకు కల్పించాం. ఓ వైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేపడుతూనే, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా మా ప్రభుత్వం చేపట్టింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాల భర్తీ అంటేనే అత్యంత అవినీతిమయం అన్న అపప్రద ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అప్పట్లో అవినీతి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా పేరుపొందింది. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా మా ప్రభుత్వం భర్తీ చేసింది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ నియామక ప్రక్రియ గురించి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఏ ఒక్క నిరుద్యోగిని అడిగినా చెప్తారు. ఇదీ ఉద్యోగాల భర్తీ పై మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
కోడ్‌ ముగియగానే
మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
ఏ ప్రభుత్వానికి అయినా ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియనే. ఆ మేరకు తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామనడంలో ఎవరికి సందే హం అక్కర్లేదు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిబద్దత, చిత్తుశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి యువత అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా యువత ఆలోచించాలని కోరుతున్నాను.

క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర స‌మితి..

సంబంధిత శాఖ‌ల వారిగా భ‌ర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు..

  1. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 30,594
  2. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డ్‌ 31,972
  3. తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌
    ఇన్ట్సిట్యూషన్స్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు 3,623
  4. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌
    అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ 179
  5. శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ 80
  6. డైరెక్టర్‌, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ 66
  7. జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీస్‌ 9,355
  8. డిపార్ట్మెంట్‌ అఫ్‌ ఆయుష్‌ 171
  9. టీఎస్‌ జెన్‌ కో 856
  10. టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ 164
  11. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ 201
  12. టీఎస్‌ ట్రాన్స్‌ కో 206
  13. టీఎస్‌ఆర్టీసీ 4,768
  14. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 12,500
  15. జెన్కో, ట్రాన్స్‌ కో, ఎన్పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ 6,648
  16. విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 22,637
  17. హైదరాబాద్‌ జలమండలి 807
  18. తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ 243
  19. డీసీసీబీలు 1,571
  20. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు 6,258
    మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,32,899
Advertisement

తాజా వార్తలు

Advertisement