Wednesday, October 9, 2024

KTR – కాంగ్రెస్ మోసాల‌కు హ‌ర్యానా ఓటర్ల చెంప‌దెబ్బ‌…

హైదరాబాద్ – 2029 ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఆగిపోతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయన్నారు. దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగవచ్చునని అభిప్రాయపడ్డారు.

హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయ‌న ట్విట్ చేశారు. నేటి ఎన్నికల ఫలితాలతో కొన్ని అంశాలు స్పష్టంగా తెలిశాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు.
ఐదు హామీల పేరుతో కర్ణాటకలో, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో, 10 హామీలతో హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి హర్యానా ప్రజలు మాత్రం బుద్ధి చెప్పారని అన్నారు. వారి అబద్దపు హామీలను నమ్మలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హామీలను అమలు చేయకుంటే నష్టం తప్పదని కాంగ్రెస్ పార్టీకి అర్థమై ఉంటుందన్నారు.

- Advertisement -

రెండు పార్టీల ప‌ట్ల విముఖ‌తే…

రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు నమ్మలేదని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు గమనించారని అన్నారు. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతైనా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి మళ్లింపు రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలను మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హితవు పలికారు. జమ్మూకశ్మీర్ లో బీజేపీని అక్కడి ప్రజలు విశ్వసించలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement