మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ శనివారం (30 మార్చి) పలు సంస్థలకు నోటీసులు పంపారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరు, ఫొటోలు ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసులు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు.
ఇప్పటికైనా తమకు, వారి కుటుంబానికి సంబంధం లేని విషయాల్లో దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్న వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ సూచించారు.పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఛానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
కుట్ర, ఎజెండాలో భాగంగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు. తమకు సంబంధం లేని అనేక విషయాల్లో తమ పేర్లు, ఫొటోలను ఉపయోగించుకుని చెత్త థంబ్‌నెయిల్స్ పోస్ట్ చేస్తున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.