Tuesday, November 26, 2024

నరసంపేట్ లో మేఘా పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన కే.టీ.ఆర్

వరంగల్, నర్సంపేట : వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మేఘా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్‌ (సీజీఎస్)ను తెలంగాణ రాష్ట్ర ఐ టీ , పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్ ఎం పీ మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బి. గోపి , మేఘా గ్యాస్ సి ఈ ఓ పీ వెంకటేష్, డి జీ ఎం టి. తిమ్మారెడ్డి, ఏ జీ ఎం లు జి. రాజ్ కుమార్, దేవా చంద్రశేఖర్, వరంగల్ మేఘా గ్యాస్ ఇంచార్జి నాయుడు హరీష్ పాల్గొన్నారు. ఈ సీజీఎస్‌ స్టేషన్‌ ప్రారంభంతో వరంగల్‌ జిల్లాలో గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు పైప్డ్ నేచురల్‌ గ్యాస్‌ను మేఘా గ్యాస్‌ సరఫరా చేయనుంది. త్వరలోనే హన్మకొండ, ఖాజీపేట, వరంగల్‌ పట్టణాల వినియోగదారులు సురక్షితమైన వంటగ్యాస్‌ను ఈ సిటీ గేట్ స్టేషన్ ద్వారా పొందవచ్చు. మేఘా గ్యాస్‌ ఇప్పటికే ఖాజీపేట, హన్మకొండ, వరంగల్‌‌లో సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించి వాహనాలకూ,‌ పరిశ్రమలకూ గ్యాస్‌ను అందచేస్తున్నది.

పాత వరంగల్‌ జిల్లాలో పీఎన్‌జీ, సీఎన్‌జీ సరఫరా కోసం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నుంచి అనుమతులు పొందింది. ఈ భౌగోళిక విభాగ (జియోగ్రాఫికల్ ఏరియా) ప్రాంతం లో మహబూబబాద్, వరంగల్‌ అర్బన్‌, వరంగల్ రూరల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 2021 లో నల్లగొండలో సీజీఎస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన మేఘా గ్యాస్ బుధవారం నర్సంపేట లో సి జి ఎస్ ను ప్రారంభించింది. త్వరలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో త్వరలో సీజీఎస్‌ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు మేఘా గ్యాస్ సి ఈ ఓ వెంకటేష్ తెలిపారు. తెలంగాణాలో ఇప్పటి వరకు 15 సీఎన్‌జీ స్టేషన్లను మేఘా గ్యాస్‌ ప్రారంభించింది. మేఘాగ్యాస్‌ సి ఈ ఓ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎన్‌జీ, పీఎన్‌జీలను గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేయడానికి సిటీ గ్యాస్‌ స్టేషన్‌ చాలా కీలకమైంది అన్నారు. మేఘా గ్యాస్‌ ఇటీవలే దేశంలో మరో 15 ప్రాంతాలకు సిటీ గ్యాస్‌ పంపీణీ చేయడానికి పీఎన్‌జీఆర్‌బీ నుంచి అనుమతులు పొందింది. దీంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 61 జిల్లాల్లో 22 జియోగ్రాఫికల్‌ ఏరియాస్‌లో గ్యాస్‌ను సరఫరా చేయనుంది అని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement