ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఈడీ కార్యాలయంలో కలిశారు. ఆమె యోగ, క్షేమాలను అడిగి కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కవితను లాయర్ మోహిత్ రావు కలిశారు.
ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అప్పగించిన ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు.. కవిత కుటుంబ సభ్యులు, ఆమె లాయర్లను ప్రతిరోజూ కలిసేందుకు వెసులుబాటు కల్పించింది. ఇక కుటుంబ సభ్యులు ఆమెకు భోజనం తీసుకురావడానికి కూడా కోర్టు అనుమతించింది.
కాగా, కవితని అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ రేపు (సోమవారం) ఆమె సుప్రీంలో పిల్ వేయనున్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత తరుఫున ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరుఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదలు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.