తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయని మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిస్కల్ ప్రూడెన్స్‌పై అనర్గళంగా మాట్లాడారని, అసలు నిజాలివే అని లెక్కలు బయటపెట్టారు. 67 ఏండ్లలో.. 2014 వరకు 14 మంది భారత ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఎనిమిదేండ్లలోనే ప్రస్తుత ప్రధాని మోదీ ఆ అప్పును రూ. 100 లక్షల కోట్లకు పెంచారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ లెక్కన ప్రతి భారతీయుడిమీద రూ. 1.25 లక్షల అప్పుందని తెలిపారు.
2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలని, అదే సమయంలో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1.49 లక్షలు మాత్రమేనని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ అప్పులు.. జీఎస్డీపీ నిష్పత్తి 23.5శాతం మాత్రమేనని, దేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యల్పంగా 23వ స్థానంలో ఉందని వివరించారు. అదే సమయంలో దేశ జీఎస్డీపీ 59శాతం అని తెలిపారు.
దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ భారతదేశ జీడీపీకి 5.0శాతం సహకరిస్తున్నదని, ఈ విషయాన్ని 2021 అక్టోబర్‌లో ఆర్‌బీఐ నివేదించినట్టు చెప్పారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ గవర్నెన్స్ అని, పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదని పేర్కొన్నారు. కేవలం బీజేపీ రాష్ట్రాలు మాత్రమే తెలంగాణతో సమానంగా పనిచేస్తే భారతదేశం ఇప్పుడు 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండేదన్నారు.