Tuesday, November 26, 2024

KTR’s Demand | నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తుందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. నిరుద్యోగులకు మోసపూరిత మాటలు చెప్పి రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టారని మండిపడ్డారు.

ఇప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్‌, ఏడు నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నవారి గురించి చేసిన వ్యాఖ్యలను, సీఎం ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోనందునే, నేడు ప్రభుత్వంపై తెలంగాణ యువత భగ్గుమంటోందన్నారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు.

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement