బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించండి
హైదరాబాద్, వరంగల్‌కు ప్రత్యేక ప్యాకేజీలివ్వండి
ఎయిర్‌పోర్టు మెట్రోకు ఆర్థిక చేయూతనివ్వండి
కేంద్రానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
ఆర్థిక, పట్టణాభివద్ధి శాఖల మంత్రులకు లేఖలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ అభి వృద్ధిలో తమ ప్రభుత్వానిది చిత్తశుద్ధి అయితే కేంద్ర ప్రభుత్వానిది వివక్ష బుద్ధని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ఎన్నిసార్లు నిధులు అడిగినా మొం డిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్‌లోనైనా తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, ఆర్థిక మంత్రులకు కేటీఆర్ ఆది వారం ఒక సవివర లేఖ రాశారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభు త్వాన్ని కోరామని గుర్తు చేసిన కేటీఆర్, ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతోందన్నారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటు- అందించేందుకు వచ్చే బడ్జెట్లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడమో లేదంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా కేటాయించాలని కోరారు.
రూ.10 వేల కోట్లకు పైగా సాయం చేయండి…
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రజలకు అత్యంత అనువుగా మారిన నేపథ్యంలో దానికి అనుసంధానంగా భవిష్యత్తు ప్రయోజ నాలను దృష్టిలో పెట్టు-కొని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని కేటీఆర్ తెలిపారు. 6,250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి సూత్రప్రాయ అంగీకారాన్ని వెంటనే మంజూరు చేసి ఈ ప్రాజెక్టుకి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలి. హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం దాదాపు రూ.3050 కోట్లు- ఖర్చు అవుతున్నాయని, ఇందులో 15శాతం మూలధన పెట్టు-బడిగా 450 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించాలి. హైదరాబాద్ మెట్రో రైల్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ- గ్యాప్ ఫండింగ్‌లోని 254 కోట్ల రూపాయల బకాయిలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులను ఈ బడ్జెట్లో విడుదల చెయ్యాలి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు 3,777 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో కనీసం 20శాతం అంటే 750 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలి. హైదరాబాద్ మహానగరంలో సంపూర్ణంగా మురుగు నీటిని శుద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా 4961 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సామర్థ్యంతో 41 ఎస్‌టీపీల నిర్మాణం జరుగుతోంది. 3722 కోట్ల రూపాయల వ్యయంతో 2232 కిలోమీటర్ల మేర భారీ మురుగునీటి సరాఫరా నెట్‌వర్క్‌ను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరయ్యే 8684 కోట్ల రూపాయల వ్యయంలో కనీసం మూడో వంతును స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భరించి తెలంగాణకు మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా చేపట్టబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే (11500 కోట్లు-), ఎస్‌ఆర్డీపీ రెండవ దశ (14 వేల కోట్లు-), డెవలప్‌మెంట్ ఆఫ్ ఎలివే-టె-డ్ కారిడార్ల నిర్మాణం- స్కై వేల నిర్మాణం (9,000 కోట్లు-) కోసం అవసరమయ్యే 34,500 కోట్ల రూపాయలలో కనీసం పది శాతం అంటే రూ.3,450 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
శానిటేషన్ హబ్‌కు ఫండింగ్ ఇవ్వండి…
తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ శానిటేషన్ హబ్‌ను ఏర్పాటు- చేస్తుంది. ఇందుకు 100 కోట్ల సీడ్ ఫండింగ్ ఇవ్వాలని కోరారు. మూడవ విడత జీహెచ్‌ఎంసీ చేపట్టిన మున్సిపల్ బాండ్స్‌కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకా లను విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తు, పన్నుల రూపంలో దేశ ఆర్థిక ప్రగతికి ఒక చోదక శక్తిగా ఉన్నదన్న కేటీ-ఆర్, ఎదుగుతున్న రాష్ట్రానికి మరింత మద్దతు అందిస్తే దేశ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వం తన సమాఖ్య స్ఫూర్తిని చాటు-కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణ పట్టణాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న ఆశాభావాన్ని కేటీ-ఆర్ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అయిన నేపథ్యంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేటీ-ఆర్ విజ్ఞప్తి చేశారు. రానున్న 2023-24 బడ్జెట్లో ఐనా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.